తెలంగాణ

telangana

ETV Bharat / crime

హనుమకొండలో అమానుష ఘటన.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

Man Slits Throat of A Girl
హనుమకొండలో విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

By

Published : Apr 22, 2022, 11:54 AM IST

Updated : Apr 22, 2022, 7:58 PM IST

11:50 April 22

Man Slits Throat of A Girl: హనుమకొండలో విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

Man Slits Throat of A Girl : ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. పోలీసులు ఎంత వేగంగా స్పందించినా.. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగటంలేదు. తాజాగా హనుమకొండలో చోటుచేసుకున్న అమానుష ఘటన కలకలం రేపుతోంది. పట్టపగలు విద్యార్థి ఇంట్లోకి చొరబడిన ఉన్మాది ఆమె గొంతుకోసి, పారిపోయాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని లక్నేపల్లికి చెందిన విద్యార్థిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఐ చివరి సంవత్సరం చదువుతూ పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ గాంధీనగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. కాగా ప్రిపరేషన్‌ కోసం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన యువతి.. నిన్న సాయంత్రం హనుమకొండకు తిరిగివచ్చింది.


వరంగల్‌ జిల్లా సంగెం మండలం ముండ్రాయికి చెందిన అజహర్‌.. గత కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గురువారం ఆమె వచ్చిన విషయాన్ని తెలుసుకుని.. గాంధీనగర్‌లోని ఇంటి వద్ద ద్విచక్రవాహనంపై తిరిగాడు. కాగా రేపటి నుంచి కేయూలో పరీక్షలు ఉండటంతో ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించి స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇంట్లో ఉన్న యువతి తల్లి.. పక్కింటికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసిన కిరాతకుడు ఫోన్‌ సంభాషణలో ఉన్న విద్యార్థినిపై దాడిచేశాడు. తాను వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమె గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్‌లో కేకలు విన్న స్నేహితులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వటంతో ఘటన విషయం అందిరికి తెలిసింది. ఘటనపై స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ఉదయం 10.30 గంటల సమయంలో నాకు ఫోన్​ వచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయికి ఎవరో అబ్బాయి గొంతు కోశారని చెప్పారు. వెంటనే నేను ఆస్పత్రికి చేరుకున్నాను. బాధితురాలు పూర్తిగా ఒత్తిడికి గురైంది. అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ రెండ్రోజుల్లో ఎంసీఏ పరీక్షలు ఉన్నాయని చెబుతోంది." -మల్లికార్జున్‌, మెడికల్‌ ఇన్‌ఛార్జి, ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌

"నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా దారుణాలు పునరావృతమవుతున్నాయి. అజహర్​ను కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి." -స్థానికులు

నిలకడగా విద్యార్థిని ఆరోగ్యం: స్నేహితుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన కుటుంబసభ్యులు, స్థానికులు రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని హుటాహుటీన ఎంజీఎంకు తరలించారు. వెంటనే స్పందించిన వైద్యసిబ్బంది చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముగ్గురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. కాగా విద్యార్థినిపై దాడి విషయం తెలుసుకున్న కేయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎంజీఎం సూపరింటెండెంట్​తో మాట్లాడిన గవర్నర్​: వరంగల్‌లో విద్యార్థినిపై దాడి పట్ల గవర్నర్ తమిళిసై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనూష ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరిటెండెంట్​తో ఫోన్​లో మాట్లాడిన గవర్నర్.. అనూష పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని తమిళిసై ఆదేశించారు. అనూషకు తగిన వైద్యం అందిస్తున్నట్లు వివరించిన సూపరింటెండెంట్.. నిపుణులైన వైద్యులతో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గవర్నర్ అన్నారు. మహిళలు, బాలికలపై దాడులు పెరగడాన్ని సమాజం తీవ్రంగా పరిగణించాలన్న తమిళిసై.. వారి పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలికలకు సమాజం నైతిక మద్దతు ఇవ్వాలని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.

మంత్రులు విచారం వ్యక్తం: విద్యార్థినిపై దాడి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​లు విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎంలో యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి.. తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థినిపై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం వైద్యులతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి కూడా మాట్లాడారు. యువ‌తికి తగిన వైద్యసేవలందించాలని వైద్యులను ఎర్రబెల్లి ఆదేశించారు. విద్యార్థినిపై దాడి ఘ‌ట‌న‌పై పోలీసుల‌ను ఆరా తీసిన మంత్రి ఎర్రబెల్లి.. నేరస్థులను చ‌ట్టరీత్యా క‌ఠినంగా శిక్షించాల‌ని సూచించారు.

నిందితుడిని విచారిస్తున్న పోలీసులు: బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించిన పోలీసులు.. నిందితుడు అజహర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటల్లోనే అజార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ నంబర్‌ ఆధారంగా ట్రేస్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితుడిని దాడి చేయడానికి గల కారణాలపై ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 22, 2022, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details