SUICIDE: ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం.. చివరికి శ్రీరామ్ (18) అనే టీనేజర్ ఆత్మహత్యకు కారణమైంది. కుటుంబ సభ్యుల వివరణ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పాండురంగ పేటకు చెందిన అడపాక శ్రీరామ్(18)కు మారిస్ పేటలోని మున్సిపల్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం ఉంది. ఇరువురి మధ్య గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
వీరి ప్రేమ వ్యవహారం కాస్త ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. శ్రీరామ్ ను హైదరాబాద్ కు పంపారు. ఈ క్రమంలో సదరు బాలిక.. శ్రీరామ్ ఫోన్ నెంబర్ కనుక్కొని అతడితో మాట్లాడడం ప్రారంభించింది. చివరికి శ్రీరామ్ హైదరాబాద్ నుంచి తిరిగి తెనాలి వచ్చేసి.. స్థానికంగా ఓ గ్యాస్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న తరుణంలో.. ఐదు రోజుల క్రితం వారు ఇంటి నుంచి వెళ్లిపోయి విజయవాడలో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత బంధువుల ఇంటికి వెళ్లారు.
శ్రీరామ్ ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. వారు విజయవాడలో ఉన్న విషయం తెలిసింది. దీంతో అక్కడికి చేరుకుని సదరు బాలికను వారి తల్లిదండ్రులకు తిరిగి అప్పగించారు. పెళ్లి చేసుకున్న వారిద్దరూ మైనర్లు కావడంతో.. పోలీసులను ఆశ్రయించినా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో.. శ్రీరామ్ తల్లిపై మైనర్ బాలిక చేయిచేసుకోవడంతో అతడు మనస్తాపం చెందాడు. దీనికి తోడు.. బాలిక బంధువులు చంపేస్తామంటూ బెదిరించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఆదివారం రాత్రి గొడవ సర్ధుమణిగాక ఎవరింటికి వారు వెళ్లిపోయారు.
సోమవారం ఉదయం శ్రీరామ్ అందరితో మాట్లాడుతూనే.. ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో బంధువులు వెనుక నుంచి తలుపు తీసి శ్రీరామ్ ని.. తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా శ్రీరామ్ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.