Hanmakonda Accident : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. ఏ పూట కూలీ ఆ పూటకే సంపాందించుకునే పరిస్థితులు. మిర్చి తోటల్లో కాయలు ఏరే సీజన్ వచ్చిందంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని సంబురపడ్డారు. మిరప తోటకు వెళ్లేందుకు ఉదయాన్నే ఇంట్లో పనులు చక్కబెట్టుకుని పిల్లలను బడికి పంపించి.. భర్తలను పనికి పంపి సద్ది పట్టుకుని పక్కన ఊళ్లో ఉండే మిరప తోటకు ట్రాలీ ఆటోలో బయలుదేరారు. కుటుంబ పరిస్థితులు.. భవిష్యత్‌పై ఆలోచనలు.. పిల్లల గురించిన ఆశలు ఇలా కష్టనష్టాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ నాలుగు కాయలు ఎక్కువ తెంపి నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించుకోవాలని ఆశపడ్డారు.
ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి.. 21 మందికి గాయాలు - శాయంపేట రోడ్డు ప్రమాదం
07:47 April 08
శాయంపేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Hanmakonda Accident Today :అంతలోనే మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎదురుగా దూసుకొచ్చిన లారీ ట్రాలీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరి కాళ్లు, చేతులు తెగి చిందరవందరగా పడ్డాయి. అప్పటిదాకా తమతో మాట్లాడిన వాళ్లు.. చేతులు తెగి, కాళ్లు విరిగి రక్తపు మడుగుల్లో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఆ లారీ ధాటికి అక్కడికక్కడే కన్నుమూశారు. త్వరగా పని ముగించుకుని ఇళ్లకు వెళ్దామనుకున్న వాళ్లంతా ఇలా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కొందరేమో అనంతలోకాలకు వెళ్లారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం.. కూలీల జీవితాలను కకాలవికలం చేసింది. కొందరి భవిష్యత్‌ను అంధకారంలోకి నెడితే.. మరికొందరి ప్రాణాలను బలితీసుకుంది.
నలుగురు మృతి :హనుమకొండ జిల్లా శాయంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాంధారిపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో ట్రాలీ ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. 25 మంది కూలీలతో కూడిన వాహనం పత్తిపాక గ్రామం నుంచి మెుగుళ్లపల్లి మండలంలో మిరప కోతలకు వెళ్తోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చేతులు తెగి, కాళ్లు విరిగి మెుత్తం 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వారందరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు మంజుల, విమల, రేణుకలుగా పోలీసులు గుర్తించారు. ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనం ఆచూకీ కనుగొనేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నమని పరాకల ఏసీపీ శివరామయ్య తెలిపారు.
పరిహారం :ఎంజీఎం ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. రూ.75వేల ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా రూ.25వేలు అందజేస్తున్నట్లు గండ్ర తెలిపారు. గాయపడిన వారికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు.