ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Lorry Accident: గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. తూ.గో జిల్లాలోని మండపేట నుంచి చెన్నైకి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అందుగుల కొత్తపాలెంలోని గుడిసెలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఎల్లనూరి బాలకోటయ్య, అతని భార్య మస్తానమ్మ, కుమారుడు హరీశ్, కుమార్తె దుర్మరణం పాలయ్యారు. వాలంటీర్‌గా విధులు నిర్వహించిన వెంకటరమణ, మనవరాలు హారికకు గాయాలయ్యాయి. మార్కాపురానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లు స్టీరింగ్, సీటుకు మధ్య ఇరుక్కుపోగా జేసీబీ సహకారంతో బయటకి తీసి 108 అంబులెన్స్ ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ధాన్యం లోడుతో..
తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నుంచి చెన్నైకి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి అందుగుల కొత్తపాలెంలోని గుడిశపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. బోల్తా పడిన లారీని జేసీబీ, క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.