తెలంగాణ

telangana

ETV Bharat / crime

Police attack: జై భీమ్ సినిమా రిపీట్.. యువకుడిని చితకబాదిన పోలీసులు...

LOCAL PEOPLE FIRES ON SURYAPET POLICE
యువకుడిని చితకబాదిన పోలీసులు.. పీఎస్ ముందు తండావాసుల ధర్నా

By

Published : Nov 11, 2021, 3:00 PM IST

Updated : Nov 11, 2021, 8:15 PM IST

14:57 November 11

Police attack: యువకుడిని చితకబాదిన పోలీసులు.. పీఎస్ ముందు తండావాసుల ధర్నా

పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన

జై భీమ్(jai bhim movie) సినిమా సీన్ సూర్యాపేట జిల్లాలో రిపీట్ అయ్యింది. ఓ యువకుడిని పోలీసులు చితకబాదిన(police attack) ఘటన సంచలనంగా మారింది. దొంగతనం నెపంతో తీసుకొచ్చి.. చావబాదడం విమర్శలకు తావిస్తోంది. పొలంలో పనిచేస్తుండగా తీసుకొచ్చి చిత్రహింసలు చేశారని.. బాధితుని కుటుంబం ఆరోపిస్తోంది. అర్ధరాత్రి వదిలేశారని.. అప్పటికి స్పృహలో లేడని... కన్నీటి పర్యంతం అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే...!

సూర్యాపేట జిల్లా(surypet) ఆత్మకూరు(ఎస్)(atmakur) మండలం రామోజీ తండాకు(ramoji thanda) చెందిన వీరశేఖర్(veera sekhar) వ్యవసాయం చేస్తాడు. అందులో భాగంగానే అన్నతో కలిసి పొలానికి వెళ్లాడు. అన్నదమ్ములు ఇద్దరూ పనిలో నిమగ్నమయ్యారు. నీళ్లు పెట్టేందుకు బావి దగ్గర స్టాటర్ వద్దకెళ్లారు. ఓ ముగ్గురు పోలీసులు వచ్చారు. వీరశేఖర్ ఎవరని అడిగారు. నేనే సార్ అంటూ వీరశేఖర్ వచ్చాడు. కొంచెం మాట్లాడేది ఉందని తీసుకెళ్లారు. ఎందుకు సార్.. ఏం మాట్లాడాలి సార్.. అంటూ వీరశేఖర్ భయపడుతూనే అడిగాడు. అదేం లేదులేవయా... కాస్త మాట్లాడాలి చిన్న విషయమేలే.. వెంటనే పంపేస్తాం.. లే.. అంటూ తీసుకెళ్లారు.  

అసలేం జరిగిందంటే...

ఆత్మకూరు(atmakur police)  మండలం ఏపూరులో నాలుగురోజుల క్రితం ఓ దొంగతనం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఆ దృశ్యాల్లో రామోజీ తండాకు (ramoji thanda)చెందిన ధరావత్ నవీన్ కనిపించాడు. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నవీన్ ఇచ్చిన సమాచారంతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ చావబాదారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఓ యువకుడే ధరావత్ వీరశేఖర్. పోలీస్‌ దెబ్బలకు(police attack) తాళలేక స్పృహ కోల్పోయాడు. ఏం చేయాలో పాలుపోని పోలీసులు వీర శేఖర్‌ను తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సృహతప్పి పడిపోయి ఉన్న వీరశేఖర్‌ను చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. తండా వాసులంతా స్టేషన్ ముందుకు చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

నేను బావి దగ్గర ఉన్న. నీళ్లు పెట్టేందుకు స్టాటర్ దగ్గర ఉన్నా సార్. కానిస్టేబుల్ వచ్చిర్రు. తీసుకుపోయి బాగా కొట్టిర్రు సార్. ఎందుకు కొట్టిర్రో తెల్వదు సార్. నేను ఏం తప్పు చేశానో చెప్పకుండా తీసుకెళ్లి కొట్టిన్రు సార్. బెల్టులతో గోడకేసి కొట్టిన్రు సార్. నేనేం తప్పు చేశానో చెప్పమని అడిగాను సార్. ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు సార్. -వీరశేఖర్, బాధితుడు

పోలీసులు సీన్ మార్చేశారు...

వీరశేఖర్​ను చేతులపై మోసుకొచ్చి తండావాసులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు సీన్​ను ఆస్పత్రికి మార్చేశారు. వైద్యులు పరీక్షిస్తే అసలు విషయం బయటికొస్తుందని... తామసలు కొట్టనే లేదని... ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగుతోంది.  

మేమిద్దరం  మిర్చి తోటకు నీళ్లు కడుతున్నాం. అప్పుడే ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చిన్రు. వీరశేఖర్ ఎవరని పిలిచిర్రు. పిలవంగనే మా తమ్ముడు పోయిండు. నేను ఎంపీటీసీ, మా బావతో కలిసి స్టేషన్​కు వెళ్లాం. ఎందుకు మా తమ్మున్ని తీసుకెళ్లారంటే వాళ్లేమీ చెప్పలేదు. మా తమ్ముని పంపించమంటే పొద్దున పంపుతమన్నరు. తర్వాత రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మీ తమ్ముడిని తీసుకపోరి అని చెప్పిండ్రు. స్టేషన్ దగ్గరకు పోతే మా తమ్ముడు సృహలో లేడు. మేమంతా కలిసి మా తమ్మున్ని ఎందుకు కొట్టారని ధర్నాకు దిగాం.  - వీరన్న, బాధితుడి సోదరుడు

జై భీమ్ సినిమా తరహాలో ఘటన

ఇటీవల సూర్య నటించిన జై భీమ్‌ సినిమా(jai bhim movie)  సంచలనం రేపింది. ఈ చిత్రంలో విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెడతారనే దృశ్యాలు అందరినీ కదిలించాయి. చేయని నేరానికి అమాయకులను కేసుల్లో ఇరికించి పోలీసులు ఎలా చావగొడతారనే కథాంశంతో వచ్చిన సినిమా చూసి చలించని వాళ్లు ఉండరు. లాకప్‌ డెత్‌ చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి దొరికిపోయిన తీరు కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ 

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌)లో వ్యక్తిని చితకబాదిన ఘటనపై విచారణ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ విచారణకు ఆదేశించారు. వీరశేఖర్​ను చితకబాదిన విషయంపై డీఎస్పీని విచారణ అధికారిగా నియమిస్తున్నామని తెలియజేశారు.  నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఎస్పీ అన్నారు. 

ఈ ఘటనను నిరసిస్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించేందుకు సూర్యాపేట వెళ్తున్న తండావాసులను చివ్వెంల మండలం కుడకుడలోని మూసీ కాల్వ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు... అక్కడే రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని.. నిందితులపై కేసు లేకుండా చూస్తామని సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

మరియమ్మ లాకప్​డెత్ జై భీమ్ చిత్రం తరహాలో జరిగిందేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది. జై భీమ్ సినిమా వచ్చిన తర్వాత మరియమ్మ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు సైతం నిన్ననే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరియమ్మ మృతి కేసు సీబీఐకి అప్పగించదగినదని వ్యాఖ్యానించింది. ఇంత జరుగుతుండగానే రాష్ట్రంలో మరో వివాదాస్పద ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. 

ఇదీ చూడండి:

మరియమ్మ మృతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. గుండె ఆగిపోయేలా కొడతారా?

Lockup Death Case: శీలం రంగయ్య ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు..?

Last Updated : Nov 11, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details