తెలంగాణ

telangana

ETV Bharat / crime

'మీ వాళ్లను రుణం చెల్లించమనండి.. లేదంటే మీ నగ్న చిత్రాలు వైరల్​ చేస్తాం' - లోన్​ యాప్​ల ఆగడాలు

Loan Apps Fraud News: రుణయాప్‌ల నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. రుణం వసూలు చేసుకునేందుకు అప్పు తీసుకున్నవారి ఫోన్‌ నెంబర్లలో మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాట్సాప్‌ డీపీలను సేకరించి ఫోటోలను నగ్నచిత్రాలుగా మార్ఫింగ్‌ చేసి వారికే పంపుతున్నారు. మీవాళ్లను తీసుకున్న రుణం చెల్లించమని చెప్పండని.. లేదంటే నగ్న ఫోటోలు.. వీడియోలుగా మారతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Loan App
Loan App

By

Published : Jul 2, 2022, 11:26 AM IST

'మీ వాళ్లను రుణం చెల్లించమనండి.. లేదంటే మీ నగ్న చిత్రాలు వైరల్​ చేస్తాం'

Loan Apps Fraud News: వ్యక్తిగత పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్న రుణ యాప్‌ నిర్వాహకులు... దారుణాలకు తెగబడుతున్నారు. రుణం ఇచ్చేముందు ఆధార్‌ కార్డు, చరవాణిలో కాంటాక్ట్‌ లిస్ట్‌ కావాలంటూ అనుమతులు తీసుకుంటున్నారు. అనంతరం నాలుగు రోజులకే ఫోన్‌ చేసి అసలు, వడ్డీ కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. వారం, పదిరోజుల వరకు గడువుందని బాధితులు చెబుతున్నా వినకుండా వరుసగా ఫోన్లు చేస్తున్నారు. బాధితుల కాంటాక్ట్‌ లిస్ట్‌లో యువతులు, మహిళల పేర్లు పరిశీలిస్తున్నారు.

వాట్సాప్‌ డీపీలో ఫోటో ఉంటే సేకరించి నగ్నంగా మార్ఫింగ్‌ చేసి ఆ యువతులు, మహిళల చరవాణులకు పంపుతున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతున్న ఆ యువతులు, మహిళలు... రుణం తీసుకున్నవారికి ఫోన్‌ చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. అప్పుతో తమకు సంబంధం లేకున్నా ఫోన్లకు నగ్నచిత్రాలు రావడంతో యువతులు, మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

రుణ యాప్‌ల నుంచి వరుసగా ఫోన్లు వస్తుండడంతో కొందరు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా... మరికొందరు ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. మరికొందరు అదృశ్యమవుతున్నారు. వీరు ఎక్కడికి వెళ్లారో తెలీక వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో రెండు రోజుల్లో రుణయాప్‌ బాధితుల్లో తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. వేర్వేరు పోలీస్‌ఠాణాల్లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేశారు. రుణ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకోవద్దని ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ ఇవ్వొద్దని పోలీసులు చెబుతున్నారు. వేధింపులు మొదలైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details