తెలంగాణ

telangana

ETV Bharat / crime

'మీ ఫ్రెండ్ అప్పు తీర్చకుంటే.. మీ నగ్నచిత్రాలు వైరల్ చేస్తా' - loan app victims suffers blackmail

అవసరం కోసం అప్పు తీసుకుంటే.. అది చెల్లించే వరకు నరకం చూపెడుతున్నారు రుణయాప్ నిర్వాహకులు. కొన్నిసార్లు చెల్లించినా.. అదనపు వడ్డీ చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు బాధితుల ఫొటోలు మార్ఫ్ చేసి బ్లాక్​మెయిల్ చేసిన రుణయాప్ నిర్వాహకులు.. ఇప్పుడు పంథా మార్చారు. బాధితుల స్నేహితులు, బంధువుల ఫొటోలు మార్ఫ్ చేసి వారికే పంపి.. మీ స్నేహితుడు/బంధువు అప్పు చెల్లించకపోతే ఆ ఫొటోలు వైరల్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

loan app victims
loan app victims

By

Published : Jun 29, 2022, 7:23 AM IST

రుణయాప్‌ల వేధింపులు బాధితులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. మౌనంగా భరించలేక.. బయటకు చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు. పోలీసు కేసులు.. అరెస్టులు మమ్మల్నేం చేయలేవంటూ నిర్వాహకులు అప్పు తీసుకున్న వారికి సవాల్‌ విసురుతున్నారు. రుణాలు పొందిన వారికే కాదు.. వారి ఫోన్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఇంటాబయట పరువు తీసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సూత్రధారులు పట్టుబడితే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదనే అభిప్రాయం పోలీసు అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో రుణయాప్‌ల వేధింపులపై 6 నెలల్లో సుమారు 150 కిపైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో అధిక శాతం నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు నమోదు చేసినవే.

మార్ఫింగ్‌.. బ్లాక్‌మెయిలింగ్‌..భాగ్యనగరానికి చెందిన యువకుడు.. రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవటంతో నిర్వాహకుల నుంచి ఒత్తిడి మొదలైంది. అసలు, వడ్డీ చెల్లించేంత వరకు వదలమంటూ వెంటపడ్డారు. అతడి నుంచి స్పందన రాకపోవటంతో బాధితుడి ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా అతడి మిత్రుల వాట్సప్‌ డీపీల నుంచి ఫొటోలు సేకరిస్తున్నారు. వాటిని నగ్నచిత్రాలుగా మార్ఫింగ్‌ చేసి వారికే పంపి.. మీ స్నేహితుడు అప్పు తీర్చకుంటే ఇవన్నీ బయటకు పంపుతామంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. మగవాళ్లు ఏదో విధంగా ధైర్యంగా ఉన్నా.. మహిళలు, యువతులు స్నేహితుల జాబితాలో ఉన్నపుడు అడిగినంత సొమ్ము చెల్లించి పరువు కాపాడుకుంటున్నారు.

రేతిబౌలికి చెందిన మహిళ ఇంటి అవసరాలకు అధిక వడ్డీకి పలు రుణయాప్‌ల నుంచి రూ.2 లక్షలు తీసుకుంది. చెల్లించడంలో ఆలస్యం కావటంతో ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్‌ చేసి కించపరిచారు. ఆమె ఫోన్‌ నంబర్‌ను 500 మంది యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్లు రావటంతో బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. మలక్‌పేట్‌ యువకుడు రూ.1.50లక్షల అప్పు చెల్లించకపోవటంతో అతడు మరణించినట్లుగా శవానికి దండవేసి మార్ఫింగ్‌ ఫొటోను కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌ నంబర్లకు వాట్సప్‌ ద్వారా చేరవేశారు.

కట్టడి చేసేదెలా..రుణయాప్‌ల వేధింపులను కట్టడి చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు సుమారు 221 రుణయాప్‌లను గూగుల్‌కు ఫిర్యాదు చేశారు. వీటిని ప్లేస్టోర్‌ నుంచి తొలగించమని కోరారు. దేశ, విదేశాలకు చెందిన 37 మందిని అరెస్టు చేశారు. ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కొత్త తరహాలో వేధింపులను తీవ్రం చేశారు. అడగకుండా, దరఖాస్తు చేయకుండానే యాప్‌ల నుంచి నగదు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, అసలు, వడ్డీ చెల్లించమంటూ వేధిస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details