Loan app administrators harassment: లోన్‌యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక గొల్లపూడి సూరాయపాలెంకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకులు.. రాజేష్ ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యంగా పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
''ఆత్మహత్యకు ముందు రాజేష్ నాకు ఫోన్ చేసి, తాను ఉరివేసుకుని చనిపోతున్నట్లు చెప్పాడు. లోన్ యాప్ ద్వారా ఆయన మొదట రూ.4 వేలు రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించేందుకు మరో లోన్ యాప్‌లో మరికొంత రుణం తీసుకున్నాడు. కొన్ని రోజులక్రితం లోన్ యాప్ నిర్వాహకులు.. రాజేష్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఫ్రాడ్ అని, డబ్బులు కట్టాలంటూ నా ఫోన్‌కు కూడా మెస్సేజ్‌లు, కాల్స్ చేశారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా నా భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.'' -రత్నకుమారి, మృతుని భార్య