మూడోసారి ఆడపిల్లే పుట్టిందని విష ప్రయోగంతో ఆ చిన్నారి ఆయువు తీసిన తల్లిదండ్రులకు నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రాసిక్యూషన్, కొండమల్లేపల్లి సీఐ పి.పరశురాం వెల్లడించారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పడమటి తండాకు చెందిన రమావత్ జయరాం, నాగమణి దంపతులు కూలీలు. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. రెండో కాన్పులోనూ అమ్మాయి పుట్టి, పురిట్లోనే మరణించింది. కుమారుడి కోసం నాగమణి 2016లో మరోసారి గర్భం దాల్చగా, అదే ఏడాది డిసెంబరులో మళ్లీ అమ్మాయే పుట్టింది. పాపను సాకలేమని చెబుతూ... బిడ్డ ఆరోగ్యం, ఆలనాపాలనాపై తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించారు. ఈ విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ టీచర్ కొండమ్మ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2017 జనవరిలో అప్పటి దేవరకొండ క్లస్టర్ సీడీపీవో భూక్యా సక్కుభాయ్ తండాకు చేరుకుని, చిన్నారిని నల్గొండ శిశు గృహానికి తరలించారు.
పసిబిడ్డను చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవం - తెలంగాణ వార్తలు
పుట్టిన బిడ్డకు పాలిచ్చి పెంచాల్సిన తల్లే ఆ చిన్నారి పాలిట యమపాశమైంది. ఆడపిల్ల పుట్టిందని రోడ్డున పడేసే మానవత్వం లేని వారిని ఇప్పటి దాకా చూశాం. కానీ విషమిచ్చి చంపుకున్న తల్లిదండ్రులను మాత్రం ఇక్కడే చూస్తున్నాం. మూడో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని కన్నవాళ్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అంగన్‌వాడీ టీచర్ చొరవతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
![పసిబిడ్డను చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవం పసిబిడ్డను చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10593082-735-10593082-1613110664651.jpg)
జనవరి చివరి వారంలో జయరాం, నాగమణి దంపతులు శిశు గృహానికి వెళ్లి, చిన్నారిని పెంచుకుంటామంటూ తమతో పాటే ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న చిన్నారి అనారోగ్యంతో మరణించిందని చెప్పి అంత్యక్రియలు చేయబోయారు. దీనిపై ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయి. విషప్రయోగం వల్లే చిన్నారి మరణించిందని పోస్టుమార్టంలో తేలింది. పాలల్లో గుళికలు కలిపి తాగించడంతో పాప చనిపోయిందని తల్లిదండ్రులు అంగీకరించారు. నేరం రుజువు కావడంతో వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు.
ఇదీ చదవండి:'తెరాస, ఎంఐఎంలు ఒక్కటేనని మరోసారి రుజువైంది'