పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు..... న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిలను దారుణంగా హత్య చేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనక ఎవరి హస్తం ఉందన్నది స్పష్టంగా తెలియకపోయినా... పలువురి పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, అధికారులకు వ్యతిరేకంగా కోర్టుల్లో వామన్‌రావు, నాగమణి దంపతులు అనేక పిటిషన్లు దాఖలుచేయడం సహా పలువురు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించేవారు.
రక్షణకల్పించాలంటూ పిటిషన్...
గతేడాది మే 22న మంథని ఠాణాలో శీలం రంగయ్య అనుమానాస్పదమృతిపై నాగమణి హైకోర్టుకు లేఖరాయగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో కోర్టు విచారణ జరిపించింది. ఆ నివేదికలో రంగయ్యది ఆత్మహత్యేనని పేర్కొనడంపై నాగమణి అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణాలకు రక్షణకల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె... రామగుండం పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్ సత్యనారాయణ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని... కేసు విచారణ పూర్తయ్యేవరకు బదిలీ చేయాలని కోరారు.
ఠాణాలకు పిలవొద్దని హైకోర్టు ఉత్తర్వులు...
పోలీసులకు భయపడి వాంగ్మూలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదంటూ గత డిసెంబరులో పిటిషన్ వేశారు. వామన్‌రావు దంపతులను పోలీస్‌స్టేషన్లకు పిలవొద్దని అప్పట్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల ఆ ఉత్తర్వులను తొలగించాలన్న ఏజీ అభ్యర్థనను తిరస్కరించింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో తమపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో హైదరాబాద్‌లో ఉన్న తమను పిలిచి వేధిస్తున్నారని నాగమణి కోర్టుకు నివేదించడంతో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది.