అందంతో వల వేస్తుంది. తియ్యని మాటలతో ముంచెత్తి.. లక్షలు మాయం చేస్తుంది. ఇలాంటి కిలాడీ లేడీ వ్యవహారం.. బయటపడింది. డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని కన్సల్టెంట్, ప్రభుత్వ కాంట్రాక్టర్ల పేరుతో పరిచయం చేసుకుంటుంది. పరిచయం పెంచుకుని ఎదుటివారిని ఆకర్షిస్తోంది. వలలో చిక్కాడని గుర్తించి.. నగదు అత్యవసరమని మాయమాటలు చెప్పి.. విడతల వారీగా లక్షల రూపాయలు దోచోస్తోంది. డబ్బు ఇవ్వమని అడిగితే.. తన వద్దే అప్పు తీసుకున్నాడని రివర్స్ కేసు పెడుతుందీ మాయ లేడీ.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన శివకృష్ణ.. మొబైల్ షాపు నిర్వహిస్తుంటాడు. శ్రీదివ్య అనే మహిళ సెల్‌ఫోన్ రిపేర్కు వచ్చి పరిచయం చేసుకుంది. అలా వారిద్దరూ కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకున్నారు. పరిచయం స్నేహంగా మారింది. తనకు రూ.కోటిన్నర విలువ చేసే పొలం ఉందని.. ప్రస్తుతం రూ.80లక్షల తాకట్టులో ఉందని చెప్పింది. ఆ భూమిని విడిపించేందుకు నగదు కావాలని సెల్‌ఫోన్ షాపు యజమాని శివకృష్ణకు తెలిపింది.