Arrest of real estate trader Srininas: ప్రీ లాంచ్ పేరుతో తక్కువ ధరల్లో ప్లాట్లను అందిస్తామని సుమారు రూ. 20 కోట్ల మేర మోసాలకు పాల్పడిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఆరో ఫేజ్‌లో కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జయత్రి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. నగర శివారు ప్రాంతాల్లోని శంకర్పల్లి, పటాన్చెరు, అమీన్పూర్ తదితర ప్రాంతాలలో ఖాళీ స్థలాలను గుర్తించి స్థల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాడు.
ఒప్పంద పత్రాలు చూపుతూ పలువురికి ప్లాట్లను తక్కువ ధరల్లో ఇప్పిస్తానని ప్రీ లాంచ్ ఆఫర్ కింద ఎర చూపాడు. ఆకర్షితులైన పలువురు అతనికి ఐదు లక్షలు మొదలుకొని కోటి రూపాయల వరకు ముట్టజెప్పారు. ఎంతకు అతను చూపించిన స్థలంలో నిర్మాణాలు జరగకపోవడంతో బాధితులు అతని కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ చేయగా.. గత నెలలో కార్యాలయాన్ని మూసేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
అప్పటినుంచి ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు శ్రీనివాస్ కార్యాలయం, అతను చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అతని ఆచూకి తెలుసుకున్నారు. ఇవాళ నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌ను కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు.