తెలంగాణ

telangana

ETV Bharat / crime

శవాల అడ్డగా కొడంగల్ పట్టణ శివారు.. పోలీసులకు పెనుసవాల్ - murders in Kodangal city outskirts

తెలంగాణ-కర్ణాటక సరిహద్దుగా ఉన్న కొడంగల్‌ పట్టణ శివారు శవాలకు అడ్డాగా మారింది. ఏడాదిలో 13 కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈ సంఘటనలు ఎక్కువ కావడం పోలీసులకు పెనుసవాలుగా మారింది. పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సైల్లో ఒకరు వీటి ఛేదనకే సమయం కేటాయించాల్సి వస్తోంది. ఏ ఒక్క ఆధారం లేకపోవడంతో వాటి గుట్టు వీడటం లేదు.

dead bodies, dead bodies in kodangal
శవాలు, కొడంగల్​లో శవాలు, శవాల అడ్డాగా కొడంగల్

By

Published : Apr 19, 2021, 10:43 AM IST

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారు శవాలకు కేరాఫ్​గా మారుతోంది. ఎక్కడో హత్యచేసి మృతదేహాలను ఇక్కడ పడేసి వెళ్లిపోతున్నారు. ఎవరు? ఎక్కడి వారో తెలియక పోవడంతో, అదృశ్యమైన సంఘటనలు ఏమైనా ఉంటే వారిని గుర్తు పట్టేందుకు కుటుంబ సభ్యులు వస్తారని శవాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో రెండు మూడు రోజులు ఉంచుతున్నారు. ఎవరు రాకపోతే చివరకు మున్సిపల్‌ సిబ్బందే ఖననం చేస్తున్నారు. ఈ కేసుల ఛేదన పట్టణ పోలీసులకు సవాల్​గా మారింది.

మూడు రోజుల వ్యవధిలో :

హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి పనులు పూర్తయ్యాక కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు పెరిగాయి. ఎప్పుడూ సందడిగా ఉంటున్నా, శవాలను గుట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళుతున్నారు. ఇటీవల మూడు రోజుల వ్యవధిలో ఓ యువకుడు, మహిళ మృతదేహాలు లభ్యమయ్యాయి. గతంలో మున్సిపల్‌ పరిధిలో గుండ్లకుంట గ్రామానికి కొంత దూరంలో మహిళల శవాలను గుర్తించారు. వాటి ఆచూకీ నేటికి లభించలేదు.

సీసీ కెమెరాలున్నా :

జాతీయ రహదారిలో మన్నెగూడ, కొడంగల్‌ పట్టణ శివారులో హైవే పోలీసుస్టేషన్లను ప్రారంభించారు. సిబ్బందిని నియమించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఇటీవల సర్కిల్‌ పరిధిలోని ఇద్దరు పోలీసులను రహదారి విధులు నిర్వహించేందుకు నియమించారు. ఇద్దరే కావడంతో రాత్రి వేళ గస్తీ తిరగడం వారికీ ఇబ్బందిగా మారింది. అలాగే సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున అమర్చినా పూర్తి స్థాయిలో పనిచేయడంలేదు. ఏ సంఘటన జరిగినా వాటిల్లో నిక్షిప్తం కావడంలేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిఘా పెంచుతాం

వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేసి, మహిళలపై హత్యాచారం చేసి మృతదేహాలను మున్సిపల్‌ పరిధిలో వదిలి వెళ్లిపోతున్నారు. ఈ సంఘటనల గురించి ఉన్నతాధికారులకు వివరించి నిఘా పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఇటీవల రెండు కేసులు వెలుగులోకి రాగా, మహిళకు సంబంధించిన వివరాలను గుర్తించాం. ఆమెను అత్యాచారం చేసి హత్యచేశారు. జక్రెస్‌పల్లి గ్రామంగా నిర్ధారణ అయ్యింది. మరో వ్యక్తి వివరాలు తెలియలేదు.

- అప్పయ్య, సీఐ కొడంగల్‌

ABOUT THE AUTHOR

...view details