చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్.. ఓ రోజు రాత్రి.. నగరం నిద్రపోతున్న వేళ.. దొంగోడు మేల్కొన్నాడు. ముందుగానే రెక్కీ నిర్వహించిన ప్రకారం.. ఖరీదైన అపార్ట్ మెంట్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడో.. పైన చదువుకున్నారు కదా.. (మళ్లీ చెబితే విసుక్కునే అవకాశం ఉందని సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది.) ఇక, నేరుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం.
ఏదో పని మీద ఊరెళ్లిన ఇంటి యజమానులు.. చోరీ జరిగిన మర్నాడు వచ్చారు. ఇల్లు చూసుకున్నారు.. ఘొల్లుమన్నారు. పోలీస్టే స్టేషన్ లో ఫోన్ రింగ్ అయ్యింది.. కాసేపటి తర్వాత ఇంటిముందు పోలీస్ సైరన్ మోగింది. ఖాకీలతోపాటు ఓ కుక్కగారు కూడా రంగంలోకి దిగారు. కానీ.. దొంగ గారికి చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టుంది. ఇల్లు అంతా తిరిగి.. అన్నీ సర్దేశి.. చివరకు వంటింట్లో భోజనం చేసి కూడా.. ఎక్కడా సింగిల్ ఎవిడెన్స్ వదల్లేదు.
పోలీసులు ఇల్లు మొత్తం శోధించారు. వంటగదిలో తిని వదిలేసిన నూడుల్స్, కోడి గుడ్ల పొట్టు.. గెలికేసిన వంట సామాన్లు తప్ప.. ఇంకేమీ కనిపించలేదు. వార్డ్ రోబ్ లో సర్దిపెట్టిన దుప్పట్లు, దిండ్లు.. మంచం మీద చిందరవందరగా పడేసి ఉన్నాయి. దోమలు కుట్టాయో ఏమో.. మస్కిటో కాయిల్స్ కూడా వెలిగించాడు దొంగ. ఈ సీన్స్ చూసిన తర్వాత.. దొంగ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడనే విషయం అర్థమైంది పోలీసులకు. కానీ.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో.. కేసు విచారణ చాలా కష్టంగా మారింది.