తెలంగాణ

telangana

ETV Bharat / crime

Follow app cheating: ఈజీ మనీతో బురిడీ.. లక్షల్లో పెట్టుబడి.. ఆ తర్వాత నిలువునా దోపిడీ

మోసపోయే వాడుంటే మోసం చేసే వాళ్లు ఎంతమందైనా పుట్టుకొస్తూనే ఉంటారు. ఓ వైపు సైబర్ మోసాల పేరిట రోజుకో కొత్త తరహా మోసం వెలుగుచూస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగడం లేదు. అదే సమయంలో ఈజీ మనీ మోజులో పడి మోసాల ఊబిలో చిక్కుకుంటున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాజాగా మరో సైబర్ తరహా మోసానికి చిక్కుకుని(Follow app cheating) వేలాది మంది బాధితులు విలవిల్లాడుతున్నారు. మల్టీ కంపెనీల పేరుతో వేలల్లో ఎరవేసి.. కోట్లు కాజేశారు. చేతిలో ఉన్న మొబైల్​తోనే రోజుకు వేలు, నెలకు లక్షల్లో సంపాదించవచ్చన్న ఆశ చూపిన సదరు కంపెనీ మోసం ఇప్పుడు సంచలనంగా మారింది.

Follow app cheating
ఫాలో యాప్​ మోసాలు

By

Published : Oct 24, 2021, 5:06 PM IST

ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తి.. ఓ యాప్​ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు. అతని సూచనతో ఫోన్​(Follow app cheating) లో ఓ యాప్ డౌన్​లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్​ని(Follow app cheating) అప్పటికే దాదాపు 10 వేల మంది ఇన్​స్టాల్​​ చేసుకున్నారు. అందులో ఉన్న ప్యాకేజీల్లో తన ఆర్థిక స్థోమతను బట్టి రూ.45000 ప్యాకేజీని ఎంచుకున్నాడు. సదరు కంపెనీకి ఆ మొత్తం ఆన్​లైన్​లో చెల్లించి గ్రూపులో చేరాడు. కంపెనీ ఇచ్చిన టాస్క్​ను రోజుకోసారి 20 రోజుల పాటు పూర్తి చేశాడు. ఇందుకు గాను రూ. 4,500 చొప్పున ప్రతిరోజు బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి చేరింది. 20 రోజుల్లోనే తాను పెట్టిన పెట్టుబడి పోగా అదనంగా మరో రూ.30 వేలు సంపాదించాడు. ఇలా డబ్బు సంపాదన ఆశతో ఆ తర్వాత ఏకంగా రూ.2 లక్షల ప్యాకేజీలో చేరాడు. అలా పెట్టిన వారం రోజులకే కంపెనీ(Follow app cheating) బోర్డు తిప్పేసింది. రూ.2 లక్షలు నష్టపోవడం బాధితుడి వంతైంది. ఇలా ఇతనొక్కరే కాదు ఒక్క ఖమ్మం నగరంలోనే వందల మంది పెట్టుబడులు పెట్టారు.

మొదటిసారే రూ. 2లక్షల ప్యాకేజీ

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మిత్రుడి ద్వారా ఫాలో యాప్ కంపెనీల్లో పెట్టుబడులకు దిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఇదే తరహా మోసానికి బలయ్యారు. చిన్న చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఎందుకని.. డబ్బు ఆశతో మొదటిసారే రూ. 2 లక్షల ప్యాకేజీ(Follow app cheating) లో చేరాడు. మరికొంతమందికి ఈ యాప్ గురించి చెప్పి భారీగా డబ్బు సంపాదించే అవకాశమని చెప్పగా కొందరు రూ.90 వేలు, మరికొందరు రూ. 2లక్షలు పెట్టుబడులు పెట్టారు. కంపెనీ ప్రారంభమైన కొత్తలో పెట్టుబడులు పెట్టిన కొందరు ఎంతో కొంత డబ్బు సంపాదించారు. కానీ.. ఒకరిని చూసి ఒకరు ఇలా చాలా మంది పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం చివరకు కంపెనీ బోర్డు తిప్పేయడం వల్ల మోసానికి బలయ్యారు. బాధితుల్లో ఒక్క ఖమ్మం నగరంలోనే వెయ్యి మంది వరకు ఉండగా.. ఉభయ జిల్లాల్లో వేల మంది బాధితులు రూ. లక్షల్లో(Follow app cheating) నష్టపోయారు. ఈ మోసాల వ్యవహారం సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వచ్చినప్పటికీ బాధితుల నుంచి ఫిర్యాదులు అందకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఆకర్షించే ప్యాకేజీలతో

మూడు నాలుగు నెలల క్రితం ముంబయి వేదికగా పుట్టుకొచ్చిన ఈ మల్టీ కంపెనీ అమాయకులనే కాదు విద్యావంతులు, ఉద్యోగులను భారీగా డబ్బు ఆశ చూపి బురిడీ కొట్టించింది. మొబైల్ ఫోన్ ద్వారా ఆన్​లైన్​లో జరిగే ఈ సరికొత్త వ్యాపారంతో అందరినీ ముగ్గులోకి దింపి నిలువునా దగా చేసింది. ప్రత్యేకంగా(Follow app cheating) యాప్​ను రూపొందించి.. వివిధ రకాల ప్యాకేజీలతో ఆకర్షించింది. కస్టమర్లతో టెలిగ్రామ్ గ్రూపును సైతం ఏర్పాటు చేశారు. కొత్తలో వీఐపీ ధర పేరుతో రూ.3000, 6000తో ప్రారంభించారు. కస్టమర్లు పెరుగుతున్న కొద్దీ ప్యాకేజీలు పెంచుతూ వచ్చారు. రెండో దఫాలో రూ.45,000 నుంచి మొదలుకొని 90 వేలు, ఆ తర్వాత రూ.2 లక్షలు, రూ.6 లక్షలు ప్యాకేజీలు నిర్ణయించారు. రూ. 3 వేలు చెల్లించిన వారికి రోజుకు రూ.144 రూపాయలు, నెలకు 4320, సంపాదించవచ్చని పేర్కొన్నారు. రూ.45,000 చెల్లిస్తే రోజుకు రూ.2175, నెలకు 65,250, రూ.2,70,000 చెల్లిస్తే రోజుకు రూ.13,500, నెలకు 4,05,000 సంపాదించవచ్చని టారిఫ్ విధించారు.

ఊరించి..ఊసురుమనిపించి

ఇలా సాధించాలంటే కస్టమర్లకు కొన్ని టాస్కులు అప్పగించారు. యూట్యూబ్​లో కొన్ని లింకులు ఇస్తారు. వాటిని లైక్ చేసి సబ్​స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రోజు వారీగా టాస్కులు పూర్తి చేసిన వారికి ఆ రోజే డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇలా కొంత మొత్తం చెల్లించిన వారికి సైతం వేలల్లో డబ్బు ఖాతాల్లో వచ్చి చేరడం వల్ల కస్టమర్లలో మరింత ఉత్సాహం, నమ్మకం పెరిగింది. అంతే ప్యాకేజీల పెట్టుబడులు అంతకంతకూ పెంచేశారు. రెండు నెలల పాటు ఈ వ్యాపారం(Follow app cheating) జోరుగా సాగింది. కస్టమర్ల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. ఒకరిని చూసి ఒకరు భారీగా డబ్బు ఆశతో పెట్టుబడులు పెట్టారు. చివరకు వినియోగదారుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు చేరింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కస్టమర్ల సంఖ్య వేలల్లో ఉన్నట్లు తెలిసింది. చివరకు రూ.6,00,000 ప్యాకేజీని ప్రకటించిన సదరు కంపెనీ.. కస్టమర్లు భారీగా చేరగానే ఉన్న ఫలంగా బోర్డు తిప్పేసింది. ఇదేంటని సంబంధిత గ్రూపుల్లో ప్రశ్నిస్తే కనీసం సమాధానం ఇచ్చే వారే కరవయ్యారు. దీంతో.. వేలాది మంది బాధితులు ఉలిక్కిపడ్డారు. సైబర్ తరహా మోసానికి గురయ్యామని లబోదిబోమంటున్నారు.

ఎవరికీ చెప్పుకోలేక

సైబర్ తరహా మోసానికి బలైన బాధితుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుంది. తాము మోసపోయినట్లు కనీసం బయట చెప్పుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఈ మోసానికి గురైన వారిలో విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు, స్థిరాస్థి వ్యాపారులు ఉన్నారు. వేలల్లో బాధితులు ఉన్నా ఒక్కరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం లేదు. పరువు పోతుందని కొందరు, పోలీసులను ఆశ్రయించడం ఇష్టంలేక ఇంకొందరు, ఏం చేసినా పోయిన డబ్బు తిరిగి రాదులే అన్న భావనలో మరికొందరు బాధితులంతా బయటకు రావడం లేదు. ఫలితంగా మోసానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

తెలిసీ మోసపోతున్నారు..

రోజుకు కొందరు బాధితులు మోసానికి గురయ్యామని గుర్తించడం, ఆ తర్వాత కిమ్మనకుండా ఉండటం పరిపాటిగా మారింది. ఇటీవల వారం, పది రోజుల్లోనే మోసపోయిన బాధితుల సంఖ్య వేలకు చేరింది. ఈ తరహా మోసాలు ఇప్పుడు కొత్తేం కాదు. రోజుకో కొత్త తరహా మోసం(Follow app cheating) ఎక్కడో ఓచోట బయటపడుతూనే ఉంది. బాధితులు మోసపోతూనే ఉన్నారు. అయినప్పటికీ సైబర్ తరహా మోసాలు మాత్రం ఆగడం లేదు. భారీగా నష్టపోతున్నామని తెలిసినా కొందరు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరికొందరు అధిక డబ్బు ఆశతో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు.

ఓ వైపు పోలీస్ శాఖ సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తోంది. వెలుగులోకి వచ్చిన ప్రతీ మోసాన్ని ప్రజలకు వివరిస్తూనే ఉంది. సామాజిక మాధ్యమాలు, అవగాహన సదస్సులతో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయినప్పటికీ మోసాల తీరు మారుతుందే తప్ప చేసే మోసం మాత్రం ఆగడం లేదు. నష్టపోతున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. సైబర్ మోసాలతో పాటు, సైబర్ తరహా మోసాలపై పూర్తిస్థాయిలో ప్రజల్లో మార్పు వస్తేనే ఈ తరహా మోసాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు చెబుతున్నారు.

ఈజీ మనీకీ ఆశపడి మోసపోవద్దు

సైబర్ నేరాలతో పాటు సైబర్ తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ దోస్త్ పేరిట కమిషనరేట్ పరిధిలో మోసాలపట్ల ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు సులభంగా డబ్బు సంపాదనకు ఆశపడి మోసపోవద్దు. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ప్రస్తుతం మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించాలి. ఫిర్యాదులు చేస్తే వారికి న్యాయం జరిగేలా పోలీసు శాఖ తరఫున బాధ్యత తీసుకుంటాం. - విష్ణు.ఎస్.వారియర్, పోలీస్ కమిషనర్, ఖమ్మం

ఇవీ చదవండి:

నిరుద్యోగులే లక్ష్యం.. రూ. 30 కోట్ల ఆన్​లైన్​ మోసం!

నల్గొండలో దొంగల హల్​చల్​.. 15.5 తులాల బంగారం,రూ.9.80 లక్షల చోరీ

ABOUT THE AUTHOR

...view details