కార్వీ సంస్థ బ్యాంకులను మోసం చేసిన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. క్వారీ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో 1.20 లక్షల మంది వినియోగదారులున్నారు. వీరి షేర్లను కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల్లో తనఖా ఉంచి 720 కోట్ల రుణం తీసుకున్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు... అతడి నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీ అప్పగించాలంటూ నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. ఈ వ్యవహారంలో సహ నిందితులు సంస్థ సంచాలకులు రామకృష్ణ, సుశీల్‌కుమార్, యుగంధర్, భగవాన్ దాస్‌లను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులలో షేర్లు తనఖా ఉంచి రూ.466 కోట్ల రుణం తీసుకున్న తరహాలోనే కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా రూ.450 కోట్ల రుణం తీసుకున్నారు. కార్వీ సంస్థ స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలపై సెబీ రెండేళ్ల క్రితం నిషేధం విధించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలకు రుణాలు చెల్లించకపోవడంతో కార్వీ సంస్థను ఏడాది క్రితం సెబీ డిఫాల్టర్‌గా ప్రకటించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు తనఖా ఉంచుకున్న షేర్లు వాటి యజమానులకు ఇచ్చేసింది. రూ. 450 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలంటూ సంస్థ ఎండీకి పలు మార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో ఐసిఐసిఐ బ్యాంకు అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.