చనిపోయిన తన చిన్నకుమారుడు లాగే ఉన్నాడని బాలుడిని కిడ్నాప్(kidnap) చేసిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు(ap police) అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనార్థం ఛత్తీస్‌గఢ్ నుంచి తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు వచ్చిన యాత్రికుల బృందంలోని చిన్నారి శివమ్ సాహూ (6) కిడ్నాప్ ఉదంతం అప్పట్లో కలకలం రేపింది. అప్పుడే బాలుడిని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించినా.. పరారీలో ఉన్న నిందితుడిని నాలుగు నెలల తర్వాత ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఛేదించామనితిరుపతి తూర్పు డీఎస్పీమురళీకృష్ణ తెలిపారు. తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకొని విచారించామని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్ తాలూక పుట్టణహళ్లి గ్రామానికి చెందిన వెంకట రమణప్ప శివప్రసాద్ అలియాస్ శివారెడ్డిగా గుర్తించామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఉత్తమ్ కుమార్ సాహూ కుమారుడు శివమ్ సాహూని కిడ్నాప్ చేసినట్లు విచారణలో అంగీకరించాడని వెల్లడించారు.
'లారీ డ్రైవరు అయిన శివారెడ్డి హిందీ భాష సరళంగా మాట్లాడటం వల్ల కొన్ని నిమిషాల్లోనే బాలుడు ఆకర్షితుడై వెంట వెళ్లాడు. బాలుడిని తీసుకుని విజయవాడకు వెళ్లగా.. తాను కిడ్నాప్ చేసిన విషయం మీడియా ద్వారా తెలుసుకుని దుర్గమ్మ గుడి సమీపంలో బాలుడిని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించాం. ఆ సమయంలో 15 టీమ్‌లు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇన్ని రోజులకు మళ్లీ తిరుపతికి వచ్చిన శివారెడ్డిని అలిపిరి ఎస్‌ఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ జయచంద్ర, సిబ్బంది ప్రసాద్, రాజశేఖర్, నాగార్జున, లక్ష్మణరావు చాకచక్యంగా అరెస్టు చేశారు.’