బొమ్మ తుపాకీ కదా అని లైట్ తీసుకొని ఫొటోలకి పోజులిస్తున్నారా.. ఇక అంతే సంగతులు.. అలా చేసిన వాళ్లు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదాం గడ్డకు చెందిన గడ్డం కృష్ణ.. బొమ్మ పిస్తోలుతో ఫొటోలకు ఫోజులు ఇచ్చి అతని స్నేహితులకు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశాడు. ఇంకేముంది సోషల్ మీడియాపై నిఘా పెంచిన పోలీసు అధికారులు.. అతని వివరాలు సామాజిక మాధ్యమాల ద్వారానే సేకరించారు.
కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశానుసారం కృష్ణను పట్టుకుని బొమ్మ పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్డం కృష్ణకు కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. తదుపరి ఆ యువకుడిపై చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.