Minor Girl Gang Rape Case Updates : జూబ్లీహిల్స్‌లోని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బెంజ్ కారులో ప్రయాణించేటప్పుడు బాధితురాలితో వీడియోలు ఎందుకు తీసుకున్నారు? ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? వైరల్‌గా ఎలా మారాయి? అన్న అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఐదురోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు వీడియోల గురించి ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లోకి పంపించిన సూత్రధారుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇప్పటికే వేలమంది వాట్సాప్ ద్వారా వీడియోలు షేర్ చేసుకున్నారని, ప్రసారమాధ్యమాలు, యూట్యూబ్‌లోనూ ఉన్నాయని తెలుసుకున్నారు. వాటిని తొలగించాలంటూ ఆయా సంస్థల ప్రతినిధులకు లేఖలు రాశారు.
'కారులో వీడియో ఎందుకు తీశారు.. అవి వైరల్ ఎలా అయ్యాయి?'
Minor Girl Gang Rape Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని పలు వివరాలు సేకరించారు. ఇంగ్లీష్ సినిమాలు చూసే గ్యాంగ్ రేప్ చేశామని నిందితులు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. పక్కా ప్లాన్‌తోనే ఈ ఘాతుకాని పాల్పడ్డామని నిందితులు విచారణలో చెప్పారు. అయితే.. రేప్ చేసేటప్పుడు వీడియో ఎందుకు తీశారు? అవి బయటకు ఎలా వచ్చాయి? ఎలా వైరల్ అయ్యాయి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణలో నిందితులు వీడియోల గురించి నోరు విప్పకపోవడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.
నిందితుల నేరశైలి గుర్తించేందుకు..
Minor Girl Gang Rape Case News : తీవ్రనేరానికి పాల్పడిన ఆరుగురు నిందితుల ప్రవర్తన, వ్యవహారశైలిని గుర్తించేందుకు పోలీసులు సామాజిక మాధ్యమాలు, నిందితుల చరవాణులను పరిశీలిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల్లో వారు గతంలో పోస్ట్‌చేసిన ఫొటోలు, సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలి మెడపై పంటిగాట్లు చేసి ‘టాటూలు’ అనడం, కాన్సూబేకరి వద్దకు చేరుకుని అందరూ కలిసి ఫోటో తీసుకున్నాక ఫేస్‌బుక్‌లో ‘‘ఇప్పుడే పార్టీ పూర్తయ్యింది’’ అంటూ పోస్ట్‌చేసిన అంశాన్ని ప్రాధాన్యంగా పరిశీలిస్తున్నారు. నిందితుల వాట్సాప్ సంభాషణలు.. రోజువారీ అలవాట్లు, ధూమపానం, కళాశాలలో వారి ప్రవర్తన వంటి అంశాలపై సమాచారం సేకరించి మానసిక నిపుణుల ద్వారా విశ్లేషించనున్నారు. వారి విశ్లేషణ ఆధారంగా నేర ప్రవృత్తిని అంచనా వేసి అభియోగపత్రాల్లో సమర్పించనున్నారు.
కీలక సాక్ష్యాధారాల సేకరణ..
సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. బెంజ్, ఇన్నోవా కార్లలో అత్యాచార ఘటనను రుజువు చేసేందుకు అవసరమైన జీవపరిమాణ సూక్ష్మక్రిములు, బాధితురాలి కేశాలు, నిందితుల లోదుస్తుల్లో చిక్కుకున్న అవశేషాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. అత్యాచార ఘటనను సాంకేతికంగానూ నిరూపించేందుకు నిందితులు, బాధితురాలి చరవాణుల సిగ్నల్స్, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన కార్లను ‘పరిస్థితుల ఆధారాలు’(సర్‌కమ్‌స్టెన్సెస్ ఎవిడెన్స్)గా అభియోగపత్రాల్లో సమర్పించనున్నారు. దీంతోపాటు మే 31న కేసు నమోదయ్యిందన్న విషయం తెలుసుకున్న నిందితులు పారిపోయి.. చిక్కేవరకు ఒకరితో ఒకరు చేసుకున్న ఛాటింగ్‌లతోపాటు ఇంకా ఎవరితోనైనా ఛాటింగ్ చేశారా, వివరాలు పంచుకున్నారా అన్న వివరాలనూ సేకరిస్తున్నారు.