Job Frauds in Hyderabad : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఉండే యువతికి వనస్థలిపురంలోని ఓ శిక్షణ కేంద్రంలో ఏపీలోని కోనసీమజిల్లా వాసి పరిచయమయ్యాడు. ఆమె ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఇక్రిశాట్‌లో తనకున్న పరిచయాలతో కొలువు ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ.2.40 లక్షలు తీసుకున్నాడు. డబ్బు చేతికి రాగానే నకిలీ ఆఫర్ లెటర్ చేతికిచ్చాడు. మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించాడు.
హైదరాబాద్ కొండాపూర్ ప్రాంత యువకుడు(25) బీటెక్ పూర్తిచేశాడు. ఐదు నెలలుగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మే 24న అతడి మొబైల్ నంబరుకు ఫేస్‌బుక్ ఐడీ ‘జాబ్స్ పవర్’ పేరుతో సందేశం వచ్చింది. ఐటీ కంపెనీల్లో అవకాశం ఇప్పిస్తామంటూ ధ్రువపత్రాల పరిశీలనకు రూ.25,000 పంపమనగా రూ.15,000 చెల్లించాడు. వాట్సప్ ద్వారా కొద్దిరోజులు స్పందించిన నిందితుడు నంబరు బ్లాక్ చేసి ముఖం చాటేశాడు.
సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో నమోదైన మోసం కేసుల్లో ఇవి కొన్నే. అయిదు నెలల వ్యవధిలోనే ఈ రెండు కమిషనరేట్లలో సుమారు 40-50 మంది వరకూ బాధితులు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదుకానివి ఇంకెన్నో ఉన్నాయి. డిగ్రీలు, పీజీలు చేసిన లక్షల మంది యువతను ప్రస్తుతం జారీ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిభావంతులు స్వయం కృషితో కొలువులు సాధించేందుకు శ్రమిస్తుండగా, కష్టపడినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో ఉన్నవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల మాటలు నమ్మి దళారులను ఆశ్రయిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల నుంచి సమాచారం సేకరించి..ఉద్యోగ సమాచారం పొందుపరిచే వెబ్‌సైట్ల నుంచి యువతీ, యువకుల విద్యార్హత సమాచారాన్ని(సీవీ) సేకరిస్తూ కొందరు ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెగబడుతున్నారు. నిరుద్యోగులను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుంటున్నారు. అవతలి వారి బలహీనతల ఆధారంగా వీలైనంత సొమ్ము దోచేస్తున్నారు.