వ్యవసాయ బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ రైతు పరిస్థితి.. ప్రస్తుతం విషమంగా ఉంది. బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలంటూ బంధువులు.. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆఫీస్ లోనికి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించిన గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
నిబంధనల ప్రకారం బోరుబావి.. బోరుబావికి మధ్య 100 మీటర్ల దూరం పాటించకుండా రమేశ్ అనే రైతు బోరు వేశాడని.. అతని వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న మరో అన్నదాత ఫిర్యాదు చేశాడు. తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు బోరును సీజ్ చేశారు. మనస్తాపానికి గురైన అతను.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని ముందుగా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.