తెలంగాణ

telangana

ETV Bharat / crime

సెలవుపై ఇంటికి వచ్చి.. రోడ్డు ప్రమాదానికి బలై.! - jawan died in road accident

సర్టిఫికెట్​లో సమస్యల పరిష్కారం కోసం సెలవుపై ఇంటికి వచ్చిన జవానును.. మృత్యువు ప్రమాద రూపంలో బలితీసుకుంది. ఇంటికి వచ్చిన 3రోజులకే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై కారు బోల్తా పడటంతో మృత్యువాత పడ్డారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

road accident in tekulapally
కల్వర్టుపై రోడ్డు ప్రమాదం

By

Published : Aug 18, 2021, 4:20 PM IST

ప్రమాదకరంగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు- కొత్తగూడెం రహదారి కల్వర్టులు ప్రమాదాలను కొనితెస్తున్నాయి. ఈ మార్గంలో పలు వంపులు ఉండటం, అటవీ మార్గం కావడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. టేకులపల్లి మండలంలో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో జవాను మృతి చెందగా, కారు బోల్తా పడి మాజీ ఎమ్మెల్యే గాయాలతో బయటపడ్డారు.

కల్వర్టులో పడి ప్రమాదానికి గురైన కారు

ఆర్మీలో పనిచేస్తూ సెలవులపై ఇంటికి వచ్చిన జవాను.. అనుకోకుండా ఎదురైన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. టేకులపల్లి మండలం మద్రాసుతండాకు చెందిన సీఆర్​పీఎఫ్​ జవాను మాళోతు జగదీశ్​ బాబు(30) ఉద్యోగ రీత్యా చెన్నైలో పనిచేస్తున్నారు. సెలవులపై మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇల్లందు నుంచి టేకులపల్లి మార్గంలోని తొమ్మిదో మైలు తండా- రోళ్లపాడు క్రాస్​ రోడ్డు మధ్య కల్వర్టు వద్ద జగదీశ్​ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. అనంతరం కాల్వలో పడిపోయింది. ఘటనలో జవాను అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

మృతునికి భార్య పుష్పలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పదో తరగతి ధ్రువీకరణ పత్రంలో సమస్య రావడంతో 3 రోజుల క్రితం సెలవుపై జగదీశ్​ ఇంటికి వచ్చారు. జగదీశ్​ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదే మండలంలో మంగళవారం కారు బోల్తా పడి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్​ వరకు జాతీయ రహదారి మంజూరైందని ఓ వైపు ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. పనులు ప్రారంభం కావడం లేదు. ప్రమాదకరంగా కల్వర్టులు మారడంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు.

ఇదీ చదవండి:high court: కుల సంఘాలకు భూకేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details