మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో ఈనెల 19న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్‌కు సహకరించిన మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
జగద్గిరిగుట్ట గిరినగర్‌కు చెందిన నవాజ్, ఇమ్రాన్లు స్నేహితులు. వీరి మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే నవాజ్‌ను ఎలాగైనా అంతమొందించాలని ఇమ్రాన్ పథకం రచించాడు.
ఈనెల 19న శ్రీకాంత్, మురళి అనే మరో ఇద్దరితో కలిసి ఇమ్రాన్ నవాజ్‌కు ఫోన్ చేశాడు. జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌కు రావాల్సిందిగా కోరాడు. నవాజ్ అక్కడికి రాగానే.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తితో పొడిచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ఇమ్రాన్‌ను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న స్నేహితులు శ్రీకాంత్, మురళిలను నేడు అదుపులోకి తీసుకున్నారు. ఏ2గా ఉన్న శ్రీకాంత్‌పై గతంలో 15 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేడు ముగ్గురినీ రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: నడిరోడ్డుపై కత్తితో దాడి.. ఆపై పరారీ..!