తెలంగాణ

telangana

ETV Bharat / crime

Agricultural Markets: ఆదాయం ఉన్నచోట అక్రమాలు - వ్యవసాయ శాఖ అక్రమాలు

ఏదైనా కార్యాలయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలొస్తే పక్కాగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనలకు మార్కెటింగ్‌శాఖ తిలోదకాలిస్తోంది. ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్‌లో అవినీతి జరిగితే దానికి అధిపతిగా పనిచేసే కార్యదర్శిదే ప్రధాన బాధ్యత. ఈ శాఖలో వీటిని పట్టించుకోవడం లేదు. పలు మార్కెట్లలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అవినీతికి పాల్పడిన కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ‘ఆన్‌డ్యూటీ’ పేరుతో మరో ప్రముఖ మార్కెట్‌కు మారుస్తున్నారు. బదిలీలపై నిషేధం ఉన్నందున ఉద్యోగుల కోరిక మేరకు వారు కోరుకున్న చోటుకు ‘ఆన్‌డ్యూటీ’ పేరుతో పంపుతున్నారు.

irregularities-in-agricultural-markets-in-telangana-state
Agricultural Markets: ఆదాయం ఉన్నచోట అక్రమాలు

By

Published : Jun 2, 2021, 7:36 AM IST

రాష్ట్రంలో గతేడాది(2020-21)లో రూ.లక్ష కోట్ల విలువైన పంటలు పండినట్లు వ్యవసాయ శాఖ(Agriculture Department) అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పంట.. ఎక్కడ.. ఏ వ్యాపారి రైతుల నుంచి కొన్నా.. కొనుగోలు విలువలో ఒక శాతం సొమ్మును ‘మార్కెట్‌ రుసుం’ పేరిట సమీపంలోని వ్యవసాయ మార్కెట్లలో చెల్లించాలి. అయితే అన్ని మార్కెట్ల ఆదాయం అంతా కలిపి రూ.350 కోట్ల వరకే ఉంది. రూ.లక్ష కోట్ల విలువైన పంటలు పండితే ఒక శాతం రుసుం కింద వాటిపై గతేడాది రూ.వెయ్యి కోట్ల ఆదాయం మార్కెట్లకు రావాలి. కానీ అందులో 65 శాతం రాలేదు. అదంతా వ్యాపారులు ఎగ్గొట్టారా? లేక మార్కెట్ల సిబ్బంది చేతివాటం ప్రదర్శించారా అనేది ఎవరికీ తెలియదు.

* ఖమ్మంలో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌ ఉంది. అక్కడ శాశ్వత(Regular) పోస్టులో కార్యదర్శిగా, మార్కెట్‌ అధిపతిగా పనిచేసే ప్రవీణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌కు కార్యదర్శిగా ఆన్‌డ్యూటీ(On Duty) పేరుతో నియమించారు. ఇందుకోసం గడ్డి అన్నారం మార్కెట్‌ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండాలి. కానీ అలా ఖాళీ లేదు. దీంతో ఇక్కడ కార్యదర్శిగా పనిచేసే వెంకటేశంను తొలుత షాద్‌నగర్‌ మార్కెట్‌కు ఆపై గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు ఆన్‌డ్యూటీ పేరుతో పంపారు. అక్కడి నుంచి ఆన్‌డ్యూటీ పేరుతో నిజామాబాద్‌ మార్కెట్‌కు పంపి అక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్న అపర్ణను గుడిమల్కాపూర్‌కు తెచ్చారు. గడ్డిఅన్నారం మార్కెట్‌(Gaddiannaram Market)కు ఆన్‌డ్యూటీలో వచ్చిన ప్రవీణ్‌కుమార్‌ ఏడాది తిరగకుండానే కొత్త లైసెన్సుల జారీ పేరుతో రూ.8 కోట్ల లంచాలు వసూలు చేశారని ఇప్పుడు ఇక ఎక్కడా నియమించకుండా మార్కెటింగ్‌ శాఖ సంచాలకుల కార్యాలయంలో రిపోర్ట్‌ చేయమన్నారు.
* ప్రవీణ్‌కుమార్‌ గడ్డి అన్నారానికి రావడంతో ఖమ్మంలో ఖాళీ ఉందనే సాకు చూపి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మార్కెట్‌ కార్యదర్శిగా పనిచేసే మల్లేశాన్ని ‘ఆన్‌డ్యూటీ’లో ఖమ్మంలో నియమించారు. హుజూర్‌నగర్‌కు వరంగల్‌లో కార్యదర్శిగా పనిచేసే సంగయ్యను అక్కడికి ఆన్‌డ్యూటీలో పంపారు. వరంగల్‌ ఖాళీగా ఉందంటూ సూర్యాపేట కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించి నియమించారు.
* రాష్ట్రంలోని మొత్తం 192 మార్కెట్లకు గాను 50 చోట్ల అసలు కార్యదర్శులనే నియమించకపోవడంతో ఖాళీలున్నాయి. అక్కడ కిందిస్థాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలప్పగించి మొక్కుబడిగా నెట్టుకొస్తున్నారు.

35 శాతమే ఆదాయం..

* పలుచోట్ల మార్కెట్లలో అధికంగా కమీషన్‌ వసూలు చేస్తూ రైతులను వ్యాపారులు దోచుకుంటున్నారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి, గడ్డి అన్నారం మార్కెట్లలో 5 నుంచి 10 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు. వ్యాపారులు నెలనెలా లంచాలు ఇస్తున్నందున పెద్ద మార్కెట్ల కార్యదర్శి పోస్టులకు భారీ డిమాండు ఉంది. వాటిని దక్కించుకోవడానికి పైరవీలు, ఒత్తిళ్లతో పాటు రూ.లక్షల లంచాలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆన్‌డ్యూటీ ఎందుకు ఇస్తున్నారనే దానిపై విచారణ జరిపితే అవినీతి బయటికొస్తుందని ఓ అధికారి తెలిపారు.
* మార్కెట్లలో అక్రమాలపై మార్కెటింగ్‌ శాఖ వర్గాలను వివరణ అడిగితే విచారణకు కొంత సమయం పడుతుందని అప్పటివరకూ మరోచోటకు ఆన్‌డ్యూటీలో పంపుతున్నట్లు చెప్పాయి. కొత్తగా ఆన్‌డ్యూటీకి వెళ్లిన చోటా సదరు అధికారులు అవినీతికి పాల్పడితే ఏం చేస్తారంటే సమాధానం లేదు.

ఇదీ చూడండి:Township: కరోనా నియంత్రణలో మలేషియా టౌన్‌షిప్‌ ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details