తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిన్న తెలుగు అకాడమీ.. నేడు గిడ్డంగుల సంస్థ.. ఒక్కడే.. రెండు స్కామ్​లు! - mastanvali news

Deposits Case: ప్రభుత్వ శాఖలకు చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను కొల్లగొట్టిన కేసులో హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు అకాడమీ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్​ చేసిన పోలీసులు... గిడ్డంగుల సంస్థకు చెందిన డబ్బులు కాజేసే ప్రయత్నం వెనుక ఎంత మంది ఉన్నారని తేల్చే పనిలో ఉన్నారు. డిపాజిట్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వాళ్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీసీఎస్​ పోలీసులు సిద్ధమవుతున్నారు.

Investigation into the case of looting of ts government departments' deposits
Investigation into the case of looting of ts government departments' deposits

By

Published : Jan 24, 2022, 10:37 AM IST

Deposits Case: తెలుగు అకాడమీకి చెందిన 53 కోట్ల రూపాయాలను కొల్లగొట్టిన నిందితులు... రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన దాదాపు 4 కోట్ల రూపాయలను కాజేసేందుకు ప్రయత్నించారు. గతేడాది జనవరిలో గిడ్డంగుల సంస్థకు చెందిన 8 డిపాజిట్లను కార్వాన్​లోని యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అందులో రెండు డిపాజిట్లను కొల్లగొట్టేందుకు బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలీ ప్రయత్నించాడు. రెండు డిపాజిట్లకు సంబధించి 3.98 కోట్ల రూపాయలకు చెందిన రెండు నకిలీ డిపాజిట్ పత్రాలు సృష్టించి వాటిని గిడ్డంగుల సంస్థ అధికారులకు ఇచ్చాడు. అసలు పత్రాలను సాయి కుమార్ అనే వ్యక్తికి మస్తాన్ వలీ ఇచ్చాడు. ఈ నెలలో గడువు ముగియడంతో వాటిని విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన గిడ్డంగుల సంస్థ అధికారులకు అసలు విషయం తెలిసింది.

మరోసారి కస్టడీలోకి...

telugu academy case: అధికారుల వద్ద ఉన్నవి నకిలీ డిపాజిట్ పత్రాలని బ్యాంకు అధికారులు గుర్తించారు. కానీ డిపాజిట్ డబ్బులు మాత్రం బ్యాంకులోనే ఉన్నాయి. తెలుగు అకాడమీ డిపాజిట్లకు చెందిన 53 కోట్ల రూపాయలను కాజేసిన కేసులో నిందితులందరూ జైళ్లో ఉండటంతోనే... ఈ డబ్బులు విత్ డ్రా చేయడం సాధ్యపడలేదని పోలీసులు భావిస్తున్నారు. గిడ్డంగుల సంస్థ డిపాజిట్ల కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ వలీని కస్టడీలోకి తీసుకునేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

డిపాజిట్లను కొల్లగొట్టారు...

యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్​గా విధులు నిర్వహించిన సమయంలో మస్తాన్ వలీ.... సాయి కుమార్, వెంకటరమణతో పాటు ఇతర నిందితులతో కలిసి డిపాజిట్లను కొల్లగొట్టాడు. తెలుగు అకాడమీకి చెందిన 53 కోట్ల రూపాయలను తప్పుడు ధ్రువపత్రాలతో విత్​డ్రా చేశాడు. మస్తాన్ వలీతో పాటు... ఇతర నిందితులు వాటాలుగా పంచుకున్నారు. ఈ కేసులో పోలీసులు మస్తాన్ వలీతో పాటు... కీలక పాత్ర పోషించిన నిందితులు, వాళ్లకు సాయం చేసిన వాళ్లందరినీ అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

కోట్ల రూపాయల స్వాధీనం

తెలుగు అకాడమీ కేసులో 4 కోట్ల 43 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ వలీ నుంచి 1.2 కోట్లు, సోమశేఖర్ నుంచి 96 లక్షలు, తణుకులో వెంకటరమణకు చెందిన 45 సెంట్ల భూమి స్వాధీనం చేసుకున్నారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన శివరాంపల్లిలో 2 కోట్ల విలువ చేసే ఫ్లాట్, వైజాగ్​లోని ద్వారకా నగర్​లో 75 లక్షల విలువ చేసే ఫ్లాట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాజేశ్​కు చెందిన అపార్ట్​మెంట్, పెంట్​హౌస్​ స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు సాయి కుమార్ పెద్ద అంబర్​పేట్​లో 16 ఎకరాలు కొన్నాడు. దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఒక్కొక్కటిగా బయటకు

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ ముఠా మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన డిపాజిట్లను మస్తాన్ వలీ ముఠా కొల్లగొట్టేందుకు కుట్ర పన్నింది. తెలుగు అకాడమీ కేసులో మస్తాన్ వలీకి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ నెల 21న విడుదలయ్యాడు. కానీ గిడ్డంగుల సంస్థ డిపాజిట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన కేసులో మస్తాన్ వలీని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటికి రాగానే అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. గిడ్డంగుల సంస్థకు చెందిన 3.98 కోట్లను కొల్లగొట్టేందుకు ఎవరెవరు ప్రయత్నించారనే విషయాలను తెలుసుకునేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డిపాజిట్ పత్రాలను సాయి కుమార్​కు ఇచ్చినట్లు మస్తాన్ వలీ పోలీసులకు తెలిపాడు. దీంతో సాయి కుమార్​తో పాటు... మస్తాన్ వలీ మరోసారి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. గిడ్డంగుల సంస్థకు చెందిన అధికారులు, సిబ్బంది ఎవరైనా వీళ్లకు సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరించనున్నారు.

అధికారులనెవరినైనా బాధ్యులను చేస్తారా

నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చినా కూడా కనీసం వాటిని గిడ్డంగుల సంస్థ అధికారులు గుర్తించకపోవడాన్ని పోలీసులు నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నారు. తెలుగు అకాడమీ కేసులో బాధ్యున్ని చేస్తూ అకౌంట్స్ అధికారి రమేశ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. గిడ్డంగుల సంస్థ కేసులో సీసీఎస్ పోలీసులు సంబంధిత అధికారులనెవరినైనా బాధ్యులను చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

ఇదీ చూడండి: Boy suicide post: ఆత్మహత్యకు అనుమతించాలంటూ బాలుడు విజ్ఞప్తి..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details