Car Accident at Jubilee Hills: నిన్న రాత్రి ఎనిమిదిన్న గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ నుంచి తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న కారు... రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారు. నగరంలో ఉంటూ బెలూన్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మహిళలతో పాటు వారి చేతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారు వేగంగా ఢీకొట్టడంతో ఆ ధాటికి తల్లి చేతుల్లో ఉన్న 2 నెలల బాబు కింద పడిపోయాడు. బలంగా కిందపడటంతో పసికందుకు తీవ్రగాయాలు కాగా.... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది బాబు సహా ముగ్గురు మహిళలకు గాయాలు కావడంతో వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. రోడ్డు దాటుతున్న తమను కారు వచ్చి ఢీకొట్టిందని... తమకు న్యాయం కావాలని బాధితులు నిమ్స్ ముందు బైఠాయించారు.
కారులో ఉన్నది ఒక్కరా.. ఇద్దరా..?
ప్రమాదానికి గురైన కారును ఘటనా స్థలంలోనే వదిలి డ్రైవర్ పారిపోయాడు. అయితే ఆక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నారా.. ఎంతమంది ఉన్నారనేది తేలాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన వాహనంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ అతికించి ఉంది. నిర్మాణ సంస్థ పేరిట కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిందని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్పందించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్... ఆ కారు తన స్నేహితుడిదని తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్ అతని వద్దకు ఎలా వెళ్లిందో తెలుసుకుంటానన్నారు.
అతివేగమే కారణమా..?
ప్రమాదం జరిగిన సమయంలో మీర్జా అనే వ్యక్తి కారు నడిపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్ఘటన జరగ్గానే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి... జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు-1 వైపు పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది... దుర్ఘటనకు అతి వేగమే కారణమా.. లేదా తాగి వాహనం నడిపారా అనేది నిందితులు దొరికితేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. మద్యం సేవించారా లేదా అని తెలుసుకునేందుకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. 24 గంటలు దాటితే రక్తంలో ఆల్కహాల్ శాతం తెలుసుకోవడం కష్టంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.