తెలంగాణ

telangana

ETV Bharat / crime

జంటహత్య కేసులో ఆసక్తికర విషయాలు.. మర్డర్​కు ముందు ఏం జరిగిందంటే..?

Abdullapurmet Double Murder Case: రాష్ట్రంలో కలకలం సృష్టించిన జంట హత్య కేసులో.. ఇప్పటికే పలు కీలక విషయాలు బహిర్గతం కాగా.. ప్రస్తుతం పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణం కాగా.. అంతకుముందు ముగ్గురు కలిసి కాసేపు కాలక్షేపం చేశారని.. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాలను పోలీసులు తెలిపారు.

Intresting facts in Abdullapurmet Double Murder Case
Intresting facts in Abdullapurmet Double Murder Case

By

Published : May 5, 2022, 8:01 PM IST

Abdullapurmet Double Murder Case: హైదరాబాద్​ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం వద్ద జరిగిన జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ స్పష్టం చేశారు. కళ్ల ముందే అనైతిక సంబంధం కొనసాగించడంతో... తట్టుకోలేక భర్తే దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు.. పథకం ప్రకారమే అదును చూసి ఇద్దరిపై దాడి చేసి హతమార్చినట్టు వెల్లడించారు. ఈ నెల 2న అబ్దుల్లాపూర్​మెట్‌లో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారనే సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. మృతులను గుర్తించి.. మహిళ భర్త శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

శ్రీనివాసరావు, జ్యోతి దంపతులు.. సికింద్రాబాద్‌ వారాసిగూడలో నివాసముంటున్నారు. జ్యోతి(36), యశ్వంత్‌(22) మధ్య కొన్నాళ్ల నుంచి వివాహేత సంబంధం నడుస్తోంది. జ్యోతి భర్త శ్రీనివాసరావుకు వీరిద్దరి వ్యవహారం తెలియగా.. పలుమార్లు మందలించాడు. ఓసారి ఇంట్లోనే వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండటాన్ని చూసి.. శ్రీనివాసరావు హెచ్చరించాడు. అయినా.. ఇద్దరి పద్ధతిలో ఎలాంటి మార్పు లేదు. ఇంకేముంది.. ఇద్దరినీ హతమార్చాలని మనసులో నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం కూడా రచించాడు. అందులో భాగంగానే.. కుటుంబాన్ని విజయవాడకు మార్చాలని జ్యోతికి వివరించాడు. అందుకు జ్యోతి కూడా ఒప్పుకుంది. "విజయవాడ వెళ్తున్నాం కదా.. యశ్వంత్‌ను చివరిసారిగా కలుస్తా" అని భర్తను జ్యోతి కోరింది. దానికి శ్రీనివాసరావు కూడా అంగీకరించాడు.

యశ్వంత్‌ను ఇంటికి పిలిచారు. ముగ్గురు కలిసి కాసేపు కాలక్షేపం చేశారు. అందరూ కలిసి రెండు స్కూటీలపై నగర శివారు కొత్తగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఓ నిర్మానుష్య ప్రదేశంలో శ్రీనివాసరావు మద్యం సేవించాడు. అదే సమయంలో యశ్వంత్‌, జ్యోతి.. శారీరంగా కలిసేందుకు వెళ్లారు. ఇదంతా తన పథకంలో భాగంగానే సాగుతుండటంతో.. అదును కోసం ఎదురుచూశాడు. జ్యోతి, యశ్వంత్‌ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో శ్రీనివాసరావు ఇద్దరిపై దాడి చేశాడు. ఇద్దరి తలలపై సుత్తితో బలంగా కొట్టాడు. యశ్వంత్‌ మర్మాంగాలను గాయపరిచాడు. ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన శ్రీనివాసరావు.. అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ యశ్వంత్​, జ్యోతి.. అక్కడే మృతి చెందారు. ఆ తర్వాత స్ధానికుల సమాచారంతో.. పోలీసుల రంగ ప్రవేశం.. దర్యాప్తు.. విచారణ.. నిందితుని అరెస్టు..!

"కొత్తగూడెం వద్ద జరిగిన జంట హత్యల కేసును ఛేదించాం. జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. ఈ కేసులో జ్యోతి భర్త శ్రీనివాసరావే ప్రధాన నిందితుడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదనే కోపంతో భార్య, యశ్వంత్‌ను భర్త శ్రీనివాస్‌ చంపాడు. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేశాం. రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురూ కలిసే కొత్తగూడెం వరకు వెళ్లారు. శ్రీనివాస్‌ ఒక్కడే ఇద్దరిని హత్య చేశాడు." - సన్‌ప్రీత్‌ సింగ్‌, ఎల్బీనగర్‌ డీసీపీ

జంటహత్య కేసులో ఆసక్తికర విషయాలు.. మర్డర్​కు ముందు ఏం జరిగిందంటే..?

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details