తెలంగాణ

telangana

ETV Bharat / crime

Darbhanga blast: ప్రయోగాల తర్వాతే పార్సిల్‌లో బాంబు!

పాకిస్థాన్​ నుంచి వచ్చిన వీడియోలను చూసి.. నాసిర్​ మాలిక్​, ఇమ్రాన్ మాలిక్​ సోదరులు బాంబును తయారు చేసి దానికి టైమర్​ అమర్చినట్లు ఎన్​ఐఏ గుర్తించింది. తయారు చేసిన అనంతరం నాలుగైదు సార్లు ప్రయోగించారన్నారు. హైదరాబాద్‌లో స్లీపర్‌సెల్‌గా ఉన్న తనకు గత ఫిబ్రవరిలోనే పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు అందాయని, అప్పటినుంచి బాంబు తయారీ యత్నాలు మొదలుపెట్టానని నాసిర్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది.

Darbhanga blast
దర్భంగా ఘటన

By

Published : Jul 6, 2021, 8:01 AM IST

దర్భంగా పేలుడు (Darbhanga blast) దర్యాప్తులో రోజురోజుకు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency ) అదుపులో ఉన్న నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ సోదరులు.. తాము పలు దఫాలు ప్రయోగాలు చేసిన తర్వాతే పార్సిల్‌లో బాంబు పంపినట్లు వెల్లడించారని తెలుస్తోంది. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన వీడియోలను చూసి స్థానికంగా లభించే రసాయనాలతో చిన్నపాటి బాంబును తయారు చేయడంతోపాటు దానికి టైమర్‌ అమర్చినట్లు తెలుస్తోంది. మెటల్‌ డిటెక్టర్ల తనిఖీల్లో పేలుడు పదార్థాన్ని గుర్తించే అవకాశం ఉండటంతోనే కేవలం మూడు అంగుళాల పొడవున్న టానిక్‌ సీసాను సంపాదించి, అందులో రసాయనం నింపి బాంబు తయారు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ప్రయాణిస్తున్న రైలులో అగ్నిప్రమాదం సృష్టించడం ద్వారా ఎక్కువ ప్రాణనష్టం కలిగించవచ్చని భావించినట్లు తెలుస్తోంది.

బాంబును తయారు చేసి పార్సిల్​లో ఉంచి

దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఆ బాధ్యతను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెంది, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న ఇక్బాల్‌ ఖాన అలియాస్‌ ఆసిఫ్‌ ఖానకు అప్పగించింది. ఇక్బాల్‌ ఖాన తన గ్రామానికే చెంది, హైదరాబాద్‌లో ఉంటున్న నాసిర్‌ మాలిక్‌ను ఎంచుకున్నాడు. అతడు మూడుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లాడు. సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, అమ్మోనియం నైట్రేట్‌, పొటాషియం క్లోరైడ్‌లను ఉపయోగించి బాంబులను తయారీ చేయడంపై అక్కడ శిక్షణ పొందాడు. ఈ బాంబును తయారు చేసిన అనంతరం నాసిర్‌ సోదరులు నాలుగైదుసార్లు ప్రయోగించారు. జూన్‌ 15న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాంబు తయారు చేసి, రాత్రి 12 గంటల సమయంలో పేలేలా టైమర్‌ అమర్చారు. దుస్తుల మధ్యలో ఉంచి పార్సిల్‌ తయారు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆసిఫ్‌నగర్‌లోని తమ ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పార్సిల్‌ బుక్‌ చేశారు. వారి ప్రయత్నం సఫలం కాకపోగా.. ఉగ్ర కుట్ర బయటపడింది. హైదరాబాద్‌లో స్లీపర్‌సెల్‌ (Sleeper cell)గా ఉన్న తనకు గత ఫిబ్రవరిలోనే పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు అందాయని, అప్పటినుంచి బాంబు తయారీ యత్నాలు మొదలుపెట్టానని నాసిర్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది.

DARBHANGA BLAST: దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

హైదరాబాద్‌కు మాలిక్‌ సోదరులు!

దర్భంగా పేలుడు కేసు నిందితులు నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను ఎన్‌ఐఏ అధికారులు సోమవారం హైదరాబాద్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కేసు తీవ్రత దృష్ట్యా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం వారిద్దర్నీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తోపాటు ఆసిఫ్‌నగర్‌లోని వారి ఇంటికి తీసుకెళ్లనున్నారు. అనంతరం తిరిగి దిల్లీకి తీసుకెళ్తారు. బాంబు తయారీ కోసం ఉపయోగించిన రసాయనాలను కొనుగోలు చేసిన దుకాణాల్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. చిక్కడపల్లి, హబీబ్‌నగర్‌లలో రసాయనాలు కొనుగోలు చేసినట్లు విచారణ సందర్భంగా నాసిర్‌ సోదరులు వెల్లడించడంతో.. ఆయా దుకాణాల యజమానుల నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. దుస్తుల పార్సిల్‌ను ఆసిఫ్‌నగర్‌లోని మాలిక్‌ సోదరుల ఇంటి నుంచి రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను కూడా విచారించడంతోపాటు వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:DARBHANGA BLAST: భాగ్యనగర కేంద్రంగా ‘ఉగ్ర’ దర్యాప్తు!

Darbhanga blast: కాసేపట్లో ఎన్​ఐఏ కోర్టుకు దర్భంగా పేలుడు కేసు నిందితులు

ABOUT THE AUTHOR

...view details