Interesting Bike Theft: "ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరా పెట్టుకుంటే రోజంతా పహారా కాస్తూనే ఉంటుంది. చోరీ జరిగితే.. దొంగను ఇట్టే పట్టేస్తుంది. దొంగతనాలు అరికట్టేందుకు సీసీకెమెరాలే ప్రధాన అస్త్రం." అంటూ.. ప్రజలకు పోలీసులు పెద్దఎత్తున అవగాహన కల్పించారు. ఫలితంగా.. కొంత మంది కలిసి తమ కాలనీల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు ప్రత్యేకంగా ఇళ్లలో కూడా పెట్టుకున్నారు. అయితే.. సీసీకెమెరాల వల్ల చాలావరకు ఉపయోగం ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. దొంగలు కూడా వాటికి తగ్గట్టుగా అప్డేట్ అయ్యారు. నిఘానేత్రాలకు చిక్కకుండా జాగ్రత్తపడుతూ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాత కోర్టు బజార్ ప్రాంతంలో జరిగిన ఓ చోరీ.. ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ దొంగతనం చేసిన చోరుడి విజ్ఞాన ప్రదర్శన అవాక్కయ్యేలా చేస్తోంది. కోర్టు బజార్లో ఓ ఉద్యోగి తన ఇంటిముందు ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. రోజూ అక్కడే పార్క్ చేస్తున్న బండిపై ఓ దొంగ కన్నేశాడు. ఎవరూలేని సమయంలో.. బండిని దొంగలించాలని పథకం కూడా వేశాడు. అయితే.. ఆ ఉద్యోగి ఇంటి ముందు సీసీ కెమెరా ఉన్న విషయాన్ని ఆ దొంగ గుర్తించాడు. ఎలాగైనా బండి కొట్టేయాలనుకున్న చోరుడు.. తన దొంగ తెలివితేటలను ప్రదర్శించాడు. సీసీ కెమెరా ఫోకస్‌ను ముందు నుంచే గమనిస్తూ వచ్చిన దొంగ.. చోరీకి వచ్చినప్పుడు తాను ఆ నిఘానేత్రానికి చిక్కకుండా జాగ్రత్త పడ్డడు. చేతికి అందేలా ఉన్న ఆ సీసీకెమెరాను ఫోకస్ ద్విచక్ర వాహనం లేకుండా పక్కకు తిప్పేశాడు. ఇంకేముంది.. వాహనాన్ని సులువుగా ఎలాంటి రిస్క్ లేకుండా.. ఎలాంటి ఆధారాలు దొరకకుండా.. దర్జాగా దొంగిలించుకుపోయాడు.