Inter student suicide : ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించి... చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆదిలాబాద్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని నందిని... ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించి... బుధవారం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు వాపోయారు. నందిని కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు... పరీక్ష తప్పానని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వివిధ జిల్లాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని... వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు బలవన్మరణానికి యత్నించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఇంటర్ పరీక్షల ఫలితాల్లో.. చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి వరుణ్(19) తప్పాడు. ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కుంగిపోయి.. ఇంట్లోనే ఉరేసుకుని మరణించాడు. హనుమకొండ జిల్లాలో మరో విద్యార్థిని కూడా ఆత్మహత్యకు యత్నించింది. కమలాపూర్ ఆదర్శ పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్‌లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినందుకు.. తీవ్రమనస్తాపంతో పాఠశాల భవనం పైనుంచి దూకేసింది. గమనించిన తోటివిద్యార్థులు.. క్షతగాత్రురాలిని హుటాహుటిన ఏంజీఎం ఆస్పత్రికి తరలించారు. తోటి విద్యార్థులు అప్రమత్తమై.. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లటం వల్ల విద్యార్థినికి ప్రాణాపాయం తప్పింది.