Student Died: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద సతీశ్(17) అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సైదాపురం మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన ఏకోలు శ్రీనివాసులు కుమారుడు సతీశ్ గూడూరు పట్టణంలో స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రోజూ స్వగ్రామం నుంచి గూడూరులోని పరీక్ష కేంద్రానికి వచ్చాడు.
పరీక్షకు ముందు పరీక్ష కేంద్రం బయట కూర్చున్న సమయంలో విద్యార్థికి ఒక్కసారిగా చమటలు పట్టి కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు వెంటనే గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు విద్యార్థిని తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు గూడూరు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు గూడూరు పట్టణ ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.