Inter Student Suicide: హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఓ బాలిక, ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ తమ తమ ఇళ్లల్లో ఉరేసుకుని మరణించారు. వాళ్లిద్దరికి ఎలాంటి ఇబ్బందులున్నా.. ఒకే ప్రాంత పరిధిలో ఒకేలా మరణించటం యాదృశ్చికమే.
ఇంద్రానగర్‌లో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఒడిశాకు చెందిన దేవానంద్ రాయ్, బిజిలి రాయ్ దంపతులు.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉదయం ఇద్దరూ పనికి వెళ్లిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలిక... చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా ఉండడాన్ని చూసి తండ్రి హతాశుడయ్యాడు. షాక్ నుంచి తేరుకుని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా బాలిక ఒంటరితనంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.