Insurance Policy Fraud Case: విశ్రాంత అధికారులు, వయోధికులే లక్ష్యంగా బీమా ఏజెంట్లు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వారి మాటల మాయాజాలంతో కోట్లకుకోట్లే కాజేసి.. జల్సాలు చేసిన బాగోతాలు బయటడుతున్నాయి. తమ వద్ద బీమా పాలసీలు చేస్తే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ.. నమ్మించి మోసాలకు పాల్పడిన ముగ్గురు ఇన్సూరెన్స్ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి బాధితులు ఒక్కొక్కరిగా బయటకువస్తున్నారు. మార్చి 24న ఓ బాధితుడు ఇచ్చి ఫిర్యాదులో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో పోలీసులు.. సుబ్రహ్మణ్యం, మనోజ్, మహేశ్‌గౌడ్ అనే ముగ్గురు ఇన్సూరెన్స్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
కుమారులకు వచ్చిన అనుమానంతో వెలుగులోకి..: హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటున్న ప్రభుత్వ విశ్రాంత అధికారి కె.జగపతిరావు(74)కు ఇద్దరు కుమారులు. ఇద్దరు లండన్‌లో స్థిరపడ్డారు. కాగా.. వాళ్ల సంపాదనను తండ్రి జగపతిరావుకు పంపించేవారు. అయితే.. తమ తండ్రి అకౌంట్‌ని చెక్ చేయగా అందులో నగదు చాలా తక్కువగా ఉంది. ఏమైందిని వెంటనే.. తండ్రికి ఫోన్ చేసి ఆరా తీశారు. బీమా పాలసీలు చేశానని తండ్రి చెప్పాడు. కట్టిన పాలసీలకు సంబంధించిన రశీదులు పరిశీలించగా ఏజెంట్లు మోసం చేసినట్టు అర్థమైంది. మోసపోయినట్టు తెలుసుకున్న జగపతిరావు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న సెంట్రల్‌క్రైం పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణ చేయగా.. కేవలం జగపతిరావు నుంచి రెండేళ్లలో రూ.4.94 కోట్లు కొట్టగొట్టినట్టు తేలింది.
అరెస్టయినట్టు వార్తలు చూసి..:ఇదిలా ఉండగా.. బోయిన్‌పల్లిలో ఓ ప్రభుత్వ విశ్రాంత అధికారి నివాసముంటున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె. కాగా.. కుమార్తె విదేశాల్లో ఉండగా.. కుమారుడు బంజారాహిల్స్‌లో ఉంటున్నాడు. పదవీవిరమణ అనంతరం వచ్చిన నగదును, కుమార్తె పంపుతున్న డబ్బును ఎక్కడైనా మదుపుచేద్దామని ఏడాదిన్నరగా అనుకుంటున్నాడు. సరిగ్గా అదేసమయంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, భారతీ యాక్సాలైఫ్ ఏజెంట్ ఉడుతా మనోజ్‌కుమార్ ఆయన్ను కలిశారు. తాము ఏళ్లుగా పాలసీలు చేయిస్తున్నామని.. తమ స్నేహితుడు బండారి మహేశ్‌గౌడ్ మరో ప్రైవేటు కంపెనీలో బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని వివరించారు. తమ వద్ద పాలసీలు చేస్తే మంచి లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మబలికారు. తరచూ ఆయన ఇంటికి వెళ్లి అప్యాయంగా మాట్లాడి.. ముగ్గులోకి దింపారు. వాళ్లు చెప్పిన మాయమాటలను ఆయన నమ్మి.. పాలసీల కోసం 17 నెలల్లో రూ.1.60కోట్లు ఇచ్చాడు. బదులుగా పాలసీలు చేయించినట్టు రసీదులు కూడా ఇచ్చారు. తీరా.. ఈ ముగ్గురు మోసగాళ్లని.. వాళ్లని అరెస్టు చేశారని.. వార్తల్లో చూసి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వాళ్లిచ్చిన రసీదులు పరిశీలిస్తే.. అవి నకిలీవని తేలింది. ఇంకేముంది.. వారి మోసంలో మరో రూ.1.60 కోట్లు చేరాయి.