Insurance Money Stolen with False Death certificates: ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన చిలకా బ్రహ్మయ్య 2013లో మరణించారు. ఈయన స్మారకార్థం గ్రామంలో రహదారి పక్కన సమాధి నిర్మించారు. బ్రహ్మయ్య చనిపోయి తొమ్మిదేళ్లు దాటింది. కానీ.. బ్రహ్మయ్య 2019లో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి... మరోసారి మరణ ధ్రువీకరణ పత్రం పొందారు.
ఈ తప్పుడు పత్రంతో కార్మిక శాఖ నుంచి... ఈ ఏడాదిలో లక్షా 30 వేల బీమా సొమ్ము పొందారు. సొమ్ములో కుటుంబీకులకు సగం, మిగిలిన సొమ్ము దళారులు నొక్కేశారు. ఈ ఒక్కటే కాదు.. వందల సంఖ్యలో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో... ప్రభుత్వం అందించే బీమా సొమ్ము కాజేస్తున్నారు. జిల్లాల్లోని అనేక గ్రామాల్లో మృతిచెందిన వారి వివరాలు అక్రమార్కులు సేకరిస్తున్నారు. మృతుల కుటుంబీకులకు ఎంతోకొంత ఇస్తామని ఆశ చూపుతున్నారు.