cyber crime Hyderabad news today : మౌలాలీలో ఉండే ఓ వ్యక్తి(32) లేబర్ క్రాంటాక్టర్‌గా పనిచేస్తుండేవారు. గతేడాది నవంబర్‌లో అనారోగ్యంతో మరణించారు. బీమా సంస్థ నుంచి ఆయన కుటుంబానికి రూ.50 లక్షలు అందాయి. ముగ్గురు పిల్లలపై తలా రూ.10 లక్షల చొప్పున భార్య ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించింది. తన దగ్గరున్న, మిగతా డబ్బును రెండు బ్యాంక్ ఖాతాల్లో(ఒకదాంట్లో రూ.28 లక్షలు, మరో ఖాతాలో రూ.5 లక్షలు) జమ చేసింది. 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్‌లైన్ క్లాస్‌లను వినేందుకు హెడ్‌ఫోన్ కావాలని అడిగింది. ఆన్‌లైన్‌లో కొంటానంటే ఫోన్ ఇచ్చింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వాటి ధర రూ.500 నుంచి రూ.600 వరకు ఉంది. ఓ వెబ్‌సైట్‌లో రూ.99కే ఇయర్‌ఫోన్స్ అంటూ మెసేజ్ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది. వస్తువును ఇంటికి తెచ్చిచ్చారు.
వరుసగా 15 రోజుల్లో ఖాళీ..
Insurance Money stolen by cyber criminals : కొన్ని రోజుల తర్వాత ఆమె మరికొంత డబ్బును జమ చేసేందుకు బ్యాంక్‌కి వెళ్లారు. బ్యాలెన్స్ ఎంతుందని అడగ్గా సున్నా ఉందని చెప్పారు. రూ.5 లక్షలుండాలి కదా అని నిలదీస్తే మాకేం తెలియదంటూ సిబ్బంది వివరించారు. మరో ఖాతా పరిశీలనకు వేరే బ్యాంక్‌కి వెళ్లారు. రూ.28 లక్షలుండాల్సిన ఖాతాలో రూపాయి లేదని తెలుసుకుని కంగుతిన్నారు. వెంటనే రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించగా, ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్ కేటుగాళ్లకు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు. ఆమె అవగాహనలేమి వారికి కలిసొచ్చినట్లుగా గుర్తించారు.