తెలంగాణ

telangana

ETV Bharat / crime

బీమా సొమ్ము స్వాహా ఉదంతంలో విచారణ వేగవంతం చేసిన కార్మికశాఖ - Khammam District Crime News

Insurance money scam in Khammam: ఉమ్మడి ఖమ్మంజిల్లాలో బీమా సొమ్ము కాజేసిన వ్యవహారంలో కార్మికశాఖ విచారణ వేగవంతం చేసింది. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతో సొమ్ము పొందిన వ్యక్తులను గుర్తిస్తున్నారు. వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నఅధికారులకు మెమోలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము కాజేసిన వ్యవహారంలో కార్మికశాఖ అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

Insurance money scam in Khammam
Insurance money scam in Khammam

By

Published : Oct 21, 2022, 10:44 AM IST

బీమా సొమ్ము స్వాహా ఉదంతంలో విచారణ వేగవంతం చేసిన కార్మికశాఖ

Insurance money scam in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలతో కార్మిక శాఖ నుంచి బీమా సొమ్ము స్వాహా ఉదంతంలో అనేక లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదుల సంఖ్యలో ముఠాలు వక్రమార్గంలో డబ్బు సంపాదించేందుకు దళారీల అవతారమెత్తి దందా సాగిస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు మాయమాటలు చెప్పి బీమా సొమ్ము కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. కార్మికశాఖలో ఏజెంట్లను పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఆ దందా జిల్లాలోని చాలా ప్రాంతాల్లోనూ సాగుతున్నట్లు తెలుస్తోంది. దళారీ ముఠా సభ్యులు గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల సమాచారం సేకరించి మృతుల ఇళ్లకు వెళ్లి పరిహారంగా బీమా సొమ్ము ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. చనిపోయినవారి వివరాలు సేకరించి వారి కుటుబీకులతో మాట్లాడి నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. ఆనంతరం కార్మికశాఖ కార్యాలయంలోని కొందరు సిబ్బంది సహకరంతో బీమా సొమ్మును విడుదల చేయిస్తున్నారు.

బీమా సొమ్ము కాజేస్తున్న ముఠాల్లో నలుగురి నుంచి ఐదుగురు చొప్పున అక్రమార్కులు ఉన్నట్లు తెలిసింది. కార్మికశాఖలోని కొంతమందికి పెద్దమొత్తంలో ముడుపులు అందడం వల్లే ఆ దందా సాఫీగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు తమ కుటుంబీకుల పత్రాలను అధికారులకు అప్పగించి ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్న వ్యవహారంపై కార్మికశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బీమా మంజూరులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులకు మెమోలు జారీ చేశారు. ఆరోపణలు వచ్చిన దరఖాస్తులపై విచారణచేయాలని ఆదేశించారు. అక్రమార్కులకు సహకరించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

తప్పుడు పత్రాలతోఅనర్హులకు మంజూరైన సొమ్ము రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే చింతకాని మండలంలో తప్పుడు పత్రంతో సొమ్ము పొందిన వారి నుంచి మొత్తం రికవరీ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details