రాంకీ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగం, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన విభాగాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో స్థిరాస్తి వ్యాపారం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తుండగా మిగిలినవి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ చేస్తున్న వివిధ వ్యాపార లావాదేవీలకు చెందిన పన్ను చెల్లింపులు సక్రమంగా లేనట్లుగా గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ, ఈ నెల 6న హైదరాబాద్‌లో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు ఇల్లు, అనుబంధ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసింది. మొత్తం 15 ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
తనిఖీల సందర్భంగా భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపన్నుశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పెద్ద మొత్తంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాంకీ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజార్టీ వాటాను విక్రయించి భారీ మొత్తం మూలధన లాభాలను ఆర్జించినట్టు ఐటీ శాఖ గుర్తించింది. అయితే మూలధన లాభాలకు బదులుగా నష్టాన్ని సృష్టించినట్లు పేర్కొంది. నష్టాలు చూపించిన మొత్తం దాదాపు రూ.1,200 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబందించి పన్ను విధించాల్సి ఉందని స్పష్టం చేసింది.