Prisoner Nagorao In Adilabad Jail Case:మహారాష్ట్ర పర్సోడికి చెందిన టేకం నాగోరావు.. ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాంసి మండలానికి చెందిన ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో.. పోక్సో చట్టం కింద 2016లో పదేళ్ల జైలు శిక్ష పడింది. వరంగల్ జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న నాగోరావును... గత జూన్‌లో ఆదిలాబాద్ జైలుకు మార్చారు. సత్ప్రవర్తనతో మెలుగుతున్నాడని భావించిన అధికారులు.... గేదెలు మేపడానికి, పాలుపితకడానికి వెసులుబాటు కల్పించారు. నాగోరావుతోపాటు మరో సహచర ఖైదీ కూడా గేదెలు మేపడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
సహచర ఖైదీ భార్యతోనూ నాగోరావుకు పరిచయం ఏర్పడింది. ఈనెల 23న ఆమె ములాఖత్‌లో భాగంగా జైలుకు వచ్చి వెళ్లింది. ఆమెకు మాయ మాటలు చెప్పి.. ఈనెల 24న మళ్లీ జైలు పరిసర ప్రాంతాలకు రప్పించాడు. ఆ రోజు పశువులను మేపడానికి వెళ్లేటప్పుడు.. జైలు సూపరింటెండెంట్ శోభన్‌బాబుకు చెందిన కుక్కపిల్లను తీసుకెళ్లాడు. పశువులు మేపే ప్రాంతానికి రక్షణగా ప్రహారి గోడలాంటి దేమీలేదు. జైలు సూపరింటెండెంట్ శునకాన్ని జైలు వెనక కట్టేసి పరారయ్యాడు. కుక్క అరుపులు గుర్తించిన జైలు సిబ్బంది... అక్కడికి వెళ్లారు. నాగోరావు పరారైనట్లు గుర్తించారు.