ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ(MMTC)ని మోసం చేసిన కేసులో ఎంబీఎస్ జ్యువెల్లర్స్(MBS JEWELLERS) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలిక జప్తు చేసింది. ఎంబీఎస్ జ్యువెల్లర్స్, ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తాకు చెందిన సుమారు రూ. 363 కోట్ల విలువైన 44 ఆస్తులను ఈడీ(ED) అటాచ్ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మరో 222 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
బంగారం కొనుగోళ్ల పేరిట
బంగారం కొనుగోళ్ల పేరిట ఎంఎంటీసీని మోసం చేశారనే సీబీఐ ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. హైదరాబాద్ ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కై.. తగిన పూచీకత్తు సమర్పించకుండా ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్లు చేసినట్లు ఈడీ తెలిపింది. ఎంఎంటీసీలోని కొందరు అధికారులు ప్రధాన కార్యాలయానికి వాస్తవాలను సమర్పించకుండా దాచిపెట్టారని పేర్కొంది. ఆ విధంగా ఎంఎంటీసీకి వడ్డీతో కలిపి సుమారు రూ. 504 కోట్ల నష్టం కలిగించినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
అక్రమ లావాదేవీలు
ఎంఎంటీసీకి నష్టం కలిగించి అక్రమంగా లబ్ధి పొందిన సుఖేష్ గుప్తా.. తన వ్యాపారాన్ని చూపించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. ఎంఎంటీసీకి ఒకే మొత్తంలో బకాయిలు చెల్లిస్తామంటూ 2019లో సుఖేష్ గుప్తా ఒప్పందం చేసుకొని.. డబ్బులు చెల్లించలేదని వివరించింది. మనీలాండరింగ్ విచారణకు సుఖేష్ గుప్తా సహకరించలేదని ఈడీ తెలిపింది. అంతే కాకుండా అక్రమ విదేశీ లావాదేవీలు బయటపడటంతో ఫెమా ఉల్లంఘనల కింద మరో కేసు నమోదు చేసి సుమారు రూ. 222 కోట్ల జరిమానా విధించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:Nagarjuna sagar: సాగర్ టు శ్రీశైలం లాంచీ సేవలు రద్దు.. ఎందుకంటే!