Venunagar village president committed suicide: ప్రభుత్వం నుంచి ఎలాగైనా నిధులు వస్తాయని గ్రామంలో పనులు చేపట్టిన సర్పంచికి చేదు అనుభవం ఎదురైంది. నిధులు వస్తాయనే ధీమాతో సొంత డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చుపెట్టారు. తీరా చూస్తే ఎంతకీ బిల్లులు రాలేదు. కుటుంబంలో డబ్బులు కోసమై పలుమార్లు గొడవలు అయ్యాయి. ఊరు కోసం మంచి పని చేసిన సర్పంచికి మాససిక ఒత్తిడి మాత్రమే మిగిలింది. చివరికి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. సర్పంచ్ భర్త తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్ గ్రామకి చెందిన రాధ ఆ గ్రామానికి సర్పంచిగా పని చేస్తుంది.
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని, అందుకు కుటుంబంలోను గొడవలు అవుతున్నాయని ఆమె పురుగుల మందు తాగి శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించినట్లు సర్పంచ్ భర్త పేర్కొన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పులు చేసి పనులు చేసిన ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో మనస్తాపం చెందిందని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.