Government lands kabza in Adilabad: ఆదిలాబాద్‌లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. మావల శివారులోని సర్వే నంబర్ 346లో 200.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 3 దశాబ్దాల క్రితం కలెక్టర్, ఎస్పీ నివాసాలు, ఐటీడీఏ క్వార్టర్లు, గాంధీ పార్కు, స్టేడియం, డైట్ కళాశాల, ప్రభుత్వ కార్యాలయాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం 134.30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
మిగిలిన 66 ఎకరాలను ఎవరికీ కేటాయించలేదు. 1994లో ఆదిలాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి 25 ఎకరాలు కేటాయించేలా అప్పటి జిల్లా పాలనాధికారి, సర్వే ల్యాండ్ రికార్డు రాష్ట్ర కమిషనర్ మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగినా కేటాయింపులు జరగలేదు. ఒకవేళ ఆ సంఘానికి 25 ఎకరాల భూమి కేటాయించి ఉంటే.. 41 ఎకరాలు మాత్రమే మిగిలి ఉండేది. కానీ కేటాయించకపోవడంతో 66 ఎకరాల భూమి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్యాక్రాంతం అవుతోంది.
"ఆదిలాబాద్‌లో ప్రభుత్వ భూములు మెత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయో సర్వే చేయడానికి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చినాా కలెక్టర్ పట్టించుకోవడం లేదు. ఆర్డీవో దగ్గర నిరీక్షణలో ఉంచుతున్నారు. దీనికి ముఖ్యకారణం అధికారుల తప్పిదాల వల్ల విలువైన ప్రభుత్వ భూములు పేదోడికి దక్కకుండా కబ్జారాయుళ్ల పాలు అవుతున్నాయి". -అరుణ్ కుమార్, సామాజిక కార్యకర్త