IIT Student Suicide: హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రాంతి నగర్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగంతస్తుల భవనం నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఐఐటీ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న దీనా(24) ఆత్మహత్య చేసుకున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడితోనే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనా తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
దీనా చిన్నప్పటినుంచి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సెల్ఫ్ లో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న దీనా అందులో పలు వీడియో గేమ్స్‌కు సంబంధించిన సూచనలను అప్లోడ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న దీనా.. వీడియో గేమ్ ఏ విధంగా ఆడాలి వాటిలో మెలకువలు ఏ విధంగా నేర్చుకోవాలనే దానికి సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేశాడు.
దీనాను అందరూ ముద్దుగా యూట్యూబ్‌లో సెల్ఫ్ లో అని పిలుచుకుంటారు. దీనా ఆత్మహత్య చేసుకునే ముందు తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్ లోడ్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలను వివరించాడు. సూసైడ్ లెటర్‌ను సైతం అందులో ఉంచాడు. చిన్నప్పటినుంచి ఎన్నో ఇబ్బందులకు గురైనట్లు... సంతోషం లేని జీవితం గడిపినట్లు దీనా లేఖలో పేర్కొన్నాడు. తల్లిదండ్రులు సైతం నిత్యం తిట్టేవారని ఎన్నో అవమానాలు భరించినట్లు లేఖలు రాశాడు. అందరూ స్వార్థం కోసం తనను ఉపయోగించుకున్నారని ఒక్కరు కూడా తనకు ఉపయోగపడలేదని లేఖలో పేర్కొన్నాడు.