Dead body in Water tank: హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ రిసాగడ్డలోని వాటర్ ట్యాంకులో మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ట్యాంకు శుభ్రపరచడానికి వెళ్లిన జలమండలి సిబ్బంది కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డీఆర్ఎఫ్ బృందాలతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీయించారు. వ్యక్తి మృతి, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం దొరికిన ట్యాంక్‌లోని నీటినే వారం రోజులుగా స్థానికులు తాగుతున్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల యువకుడి మృతదేహంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ట్యాంక్ నీరు నాలుగు బస్తీలకు వెళ్తుందని స్థానిక కార్పొరేటర్ తెలిపారు. శివస్థాన్‌పూర్, హరినగర్, పద్మశాలి కాలనీ సహా మరో బస్తీకి ఈ నీరు వెళ్తుందని చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వారంలో ఓ ఇంట్లో.. నీట్లో నుంచి వెంట్రుకలు, మాంసం ముద్దలు వస్తున్నాయని ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా అందుకు కారణం గుర్తించలేకపోయారని స్థానికులు తెలిపారు.