HYDERABAD TERROR CASE UPDATES: ఉగ్ర కుట్ర పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతించడంతో.. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాహెద్, సమీయుద్దిన్, మాజ్ హసన్‌లను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి నిందితులను ప్రశ్నిస్తున్నారు. దసరా సందర్భంగా పేలుళ్ల కోసం ముగ్గురు నిందితులు కుట్ర పన్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు పది రోజుల క్రితం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి హ్యాండ్ గ్రనేడ్లు, నగదు, చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇప్పటికే చరవాణిలను విశ్లేషించారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా జాహెద్ పాకిస్థాన్‌లో ఉన్న ఘోరితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అర్ధం కాని విధంగా కోడ్ భాషలో సందేశాలు పంపినట్లు గుర్తించారు.
కోడ్ భాషను డీకోడింగ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారన్నంతా నిందితుల నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. పాక్ తీవ్రవాదుల నుంచి హవాలా మార్గంలో వచ్చిన రూ.30లక్షలకు పైగా నగదును ఎక్కడ ఖర్చు చేశారనే విషయాలను కూపీ లాగుతున్నారు. హ్యాండ్ గ్రనేడ్లు మనోహరాబాద్‌కు ఎలా చేరాయనే విషయాన్ని వారి వద్ద ప్రస్తావిస్తున్నారు. ఉగ్ర కుట్ర కేసులో ఎంత మంది ప్రమేయముందనే వివరాలను నిందితుల నుంచి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అసలేం జరిగిదంటే:ఇటీవల నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను అవకాశంగా చేసుకుని మతఘర్షణలు రెచ్చగొట్టేందుకు మూసారాంబాగ్‌కు చెందిన జాహెద్‌కు పాకిస్థాన్ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఇందుకోసం ఇతను వాడుకుంటున్నట్టు భావిస్తున్నారు. హిందూ పండుగలు, భాజపా, ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాన్ని అమలు చేసేందుకు దసరా పండుగను అవకాశంగా మలచుకోవాలనుకున్నారు.
నీలిరంగు గ్రనేడ్లతో దాడులతో దాడికి యత్నం: భారీ ఎత్తున పేలుళ్ల కోసం బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేవారు. అవతలి వైపు నుంచి ఇంటర్‌నెట్, ఫోన్ ద్వారా తయారీపై సూచనలు చేసేవారు. పోలీసు నిఘా పెరగడం, తయారీలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాడులకు గ్రనేడ్లను వినియోగించాలనుకున్నారు. ఇటీవల కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు నీలిరంగు గ్రనేడ్లతో దాడులు చేశారు. ఆ గ్రనేడ్లు చైనాలో తయారైనట్టు బయటపడింది. రెండు నెలల క్రితం అవే గ్రనేడ్లు పాకిస్థాన్ నుంచి కశ్మీర్ చేరాయి.