Hyderabad terror case: భాగ్యనగరంలో భాజపా, ఆర్ఎస్ఎస్ నేతలు, పండుగలను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించేందుకు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ పరూక్ కుట్ర పన్నినట్లు తేటతెల్లమైంది. సిట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితుల్లో అబ్దుల్ జాహెద్‌కు 22 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయి. అతడి ప్రసంగాలతో మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ పరూక్ తీవ్రవాదంవైపు ఆకర్షితులయ్యారు.
2018లో ఐసిస్‌లో చేరేందుకు సిరియా పయనమైన ఇద్దరిని ముంబయి విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. స్థానిక యువతను ఆకట్టుకొని ఉగ్రవాద సంస్థల్లోకి ముగ్గురూ రిక్రూట్‌మెంట్ చేపట్టారు. దీనికి అవసరమైన నిధులు పాకిస్థాన్ నుంచి చేరుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. గ్రనేడ్లు నగరానికి ఎవరు తీసుకొచ్చారు. ఏ మార్గంలో వీరికి చేర్చారు.. దీని వెనుక జరిగిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మారాడు అనుకుంటే పాత లింకులు బయలు..: పాకిస్థాన్‌లో తలదాచుకున్న 62 ఏళ్ల ఫర్హతుల్లా అలియాస్ అబు సుఫియాన్ అలియాస్ సర్దార్ సాహెబ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. కేంద్రం ప్రకటించిన వ్యక్తిగత ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. సైదాబాద్‌లోని కూర్మగూడ అతని స్వస్థలం. మైనార్టీ సంస్థలో పనిచేసిన ఘోరీ 1981లో బయటకు వచ్చాడు. సౌదీ అరేబియాలో చేరి అక్కడి నుంచే లష్కరే తోయిబా, జైషే ఈ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తున్నాడు. దేశంలో పలు బాంబు పేలుళ్లలో ఇతడు ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం పాకిస్థాన్‌కు మకాం మార్చాడు. అతడి వ్యక్తిగత సహాయకుడు తాజాగా అరెస్టయిన అబ్దుల్ జాహెద్ సోదరుడు మాజిద్ పని చేస్తున్నాడు.