బాలిక అపహరణ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. రెండున్నర సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్‌ను పట్టుకొని అతని నుంచి చిన్నారిని కాపాడి తిరిగి తల్లి చెంతకు చేర్చారు. మలక్‌పేట్ మూసారాంబాగ్‌లో సుద్గు అతని భార్య, రెండున్నర సంవత్సరాల కుమార్తెతో కలిసి ఉంటున్నారు. వీరు రాత్రి సమయాల్లో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తారు. ప్రతి రోజు మాదిరిగానే ఈ నెల 28న దంపతులు నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో తమ కుమార్తె లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ దొరకపోవడంతో ఆందోళన చెందిన వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమారాల దృశ్యాలను పరిశీలించగా... చిన్నారి బాలికను ఆటో డ్రైవర్ అపహరించినట్లు గుర్తించారు.
ఆటో డ్రైవర్ శ్రావణ్‌కుమార్ బాలికను అపహరించారు
కాచిగూడు గోల్నాకాకు చెందిన ఆటో డ్రైవర్ శ్రావణ్‌కుమార్ బాలికను అపహరించినట్లు తేల్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఇతనిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇతను.. చిన్నారిని అపహరించి... పిల్లలు లేని వారికి విక్రయించడానికి యత్నించాడని చెప్పారు. ఈ తరహా కేసులను ఛేదించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. గత ఏడాది 376 మంది చిన్నారులు రక్షించినట్లు.. అందులో 277 మంది చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చగా, మిగతా 99 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లి నగలు కొందామని బయల్దేరిన వధువు సహా ఆరుగురు మృతి