హైదరాబాద్ నగరంలో గంజాయి (Ganja in Hyderabad) అధికంగా పట్టుబడటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కీలక ప్రాంతాలైన దూల్పేట్, మెహదీపట్నం, లంగర్ హౌస్, మంగళ్ హాట్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. మొదట నిర్వహించిన డ్రైవ్లో 10 కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. సెప్టెంబర్లో నిర్వహించిన రెండో డ్రైవ్లో మొత్తం 82 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 1,500 కిలోల గంజాయి పట్టుబడింది. ఇందులో 120 మందిని అరెస్టు చేయగా మరో 239 మంది పేర్లు బయటకు వచ్చాయి. 23 మందిపై ఇప్పటి వరకు పీడీ యాక్ట్ ప్రయోగించారు. మరో 13 మందిని గుర్తించారు. వీరిపై త్వరలో పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు.
20 మంది అరెస్టు
నిత్యం గంజాయి (Ganja in Hyderabad) సరఫరా చేయడం అలవాటుగా మారిన 60 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. అడపాదడపా విక్రయించే 35 మందిని గుర్తించి... వీరికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయిని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు నిందితులకు సహకరిస్తున్న 17 లారీ ట్రాన్స్పోర్ట్లను గుర్తించారు. ఇందులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. నగరానికి ప్రధానంగా ఒడిశా సరిహద్దు, శ్రీకాకుళం సీలేరు, విశాఖపట్నంలోని నర్సీపట్నం, తుని, మహారాష్ట్ర సరిహద్దుల నుంచే గంజాయి నగరానికి వస్తున్నట్లు గుర్తించారు.