హైదరాబాద్ పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసుల(Panjagutta Girl murder case) దర్యాప్తు కొనసాగుతోంది. ఓ మహిళ, వ్యక్తి, ఓ బాబు కలిసి లక్డీకపూల్ వైపు నుంచి ఆటోలో వచ్చి ద్వారకాపురిలోని ఓ దుకాణం ముందు ఈ నెల 4న చిన్నారి మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా మహిళతో పాటు ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఆచూకీ కోసం 10 పోలీసు బృందాలతో జల్లెడపడుతున్నారు.
ఆ ముగ్గురు ఎవరు?
కర్ణాటక నుంచి వచ్చిన బస్సులో లక్డీకపూల్లో దిగిన నలుగురు... అక్కడ ఆటో మాట్లాడుకొని ద్వారకాపురి కాలనీ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఓ కుటుంబంలా ఆటోలో వచ్చి మృతదేహాన్ని పడేసి మెహదీపట్నం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు మెహదీపట్నంతో పాటు.... లక్డీకపూల్‌లోని ట్రావెల్స్ కార్యాలయాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాలిక కడుపు, వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. బాలికను కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాలిక మృతదేహాన్ని పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్లంతా కుటుంబ సభ్యులేనా? లేకపోతే వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగింది?
పంజాగుట్ట పీఎస్ పరిధిలోని నాలుగేళ్లున్న బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు బృందాలుగా ఏర్పడి.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. దీపావళి రోజు(గురువారం) ఉదయం జేవీఆర్ పార్కు ఎదుట ద్వారకాపురి కాలనీలోని మూసి ఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక పడిఉన్నచోట రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదన్న నిర్ధారణకు వచ్చారు. ఎక్కడో చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల పుటేజీ పరిశీలించినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. చిన్నారి మృతదేహంపై పాత గాయాలున్నాయని, అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. ‘రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ కేసుల వివరాలు పరిశీలిస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలిక ఎప్పుడు? ఎలా మరణించింది? శరీరంపై ఇంకా ఏమైనా గాయాలున్నాయా? అనేది తెలుస్తుంది. త్వరలో నిందితులను గుర్తిస్తాం’ అని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:Panjagutta Girl Murder Case: పంజాగుట్ట బాలికది హత్యే.. కడుపులో తన్నడం వల్లే మృతి