హైదరాబాద్‌లో కలకలం రేపిన మూడేళ్ల బాలుడి అపహరణ కేసును అబిడ్స్ పోలీసులు ఛేదించారు. బాలుడిని అపహరించిన శ్యామ్ బీంరావు సోలంకిని అరెస్టు చేశారు. అపహరణకు గురైన బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాటంతో ఆ కన్నవారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన శివకుమార్ అతని భార్య అంబిక లాక్‌డౌన్‌కు ముందు నగరంలోనే ఉంటూ హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగించే వారు.
ఫుట్‌పాత్‌లపైనే జీవనం
లాక్‌డౌన్ కారణంగా వారు తమ ముగ్గురు పిల్లలతో కలిసి స్వస్థలానికి వెళ్లిపోయారు. పరిస్థితులు మారటంతో శివకుమార్ తన కుటుంబంతో కలిసి ఈనెల 4న హైదరాబాద్ చేరుకున్నాడు. అతను కుటుబంతో ఫుట్‌పాత్‌లపైనే నివసించే వాడు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఉంటున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బోగిరామ్, శ్యామ్‌బీం రావు సోలంకి వారికి పరిచయమయ్యారు. శివకుమార్ ముంబాయిలోని హోటల్‌లో పని ఇప్పిస్తామంటూ నమ్మించి... వారితో చనువుగా మెలిగారు.
చరవాణి, డబ్బులు ఎత్తుకెళ్లారు
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శివకుమార్ కుటుంబం నిద్రించిన సమయంలో వారి చరవాణి, మూడు వేల రూపాయలు చోరీ అయ్యాయి. దీంతో బాధిత కుటుంబం తమ మకాం గాంధీభవన్ మెట్రో స్టేషన్ సమీపంలోకి మార్చింది. మహారాష్ట్ర వాసులు కూడా వారితో పాటే అక్కడకు చేరుకున్నారు. శివకుమార్ అతని భార్య పని వెతుక్కుంటూ వెళ్లిన సమయంలో శ్యాంబీంరావు సోలంకి ఇదే అదునుగా భావించి... శివకుమార్ మూడు సంవత్సరాల కుమారుడు రుద్రమణిని అపహరించి అక్కడ నుంచి పరారయ్యాడు.