CV Anand on drugs: మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి సహాయం చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 4 రిహాబిలిటేషన్ సెంటర్స్‌తో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు బానిసైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కు తరలిస్తామని సీపీ వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకునే 377 మందిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారిపైనా నిఘా పెట్టినట్లు వివరించిన ఆయన.. డ్రగ్స్ బాధితులు జైలు నుంచి వచ్చాక మంచి పౌరులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'రిహాబిలిటేషన్ సెంటర్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నాం. ఈ రిహాబిలిటేషన్ ప్రాసెస్ నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సెంటర్స్‌లో వారానికి రెండుసార్లు డ్రగ్స్ బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎవరికైతే అడ్మిట్ అవసరమో.. అలాంటి వారిని అడ్మిట్ చేసుకుని కౌన్సెలింగ్ ఇస్తారు.' -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
గంజాయి ముఠా అరెస్ట్..: మరోవైపు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయిట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షహ్జదా ఇప్పటికే ముంబయిలో పోలీసులకు పట్టుబడినట్లు సీపీ పేర్కొన్నారు.
ముంబయికి చెందిన షహ్జదా.. బహదూర్‌పురాకు చెందిన షేక్ అబ్దుల్ ఆలం ఖాద్రి, ఉప్పల్ వాసి షేక్ ఖాసిం, చాంద్రాయణగుట్టకు చెందిన షాహీద్ కమల్ కలిసి ఓ ముఠాగా ఏర్పడి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. 'బిస్కెట్లు విక్రయించే వ్యాపారం చేసుకునే అబ్దుల్ ఆలం ఖాద్రి.. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ముంబయి వాసి షహ్జదాతో పరిచయం ఏర్పడింది.